SkyTracks: వరల్డ్ బెస్ట్ ఎయిర్ పోర్టుల జాబితాలో మరింత మెరుగైన శంషాబాద్ ఎయిర్ పోర్టు ర్యాంకు

Shanshabad airport gets 61th rank in SkyTracks list

  • వరల్డ్ బెస్ట్ ఎయిర్ పోర్టుల జాబితా విడుదల చేసిన స్కైట్రాక్స్
  • 36వ స్థానంలో నిలిచిన ఢిల్లీ ఎయిర్ పోర్టు
  • 59వ స్థానంలో బెంగళూరు, 61వ స్థానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు
  • 95వ ర్యాంకుకు పడిపోయిన ముంబయి విమానాశ్రయం

అంతర్జాతీయ రవాణా రేటింగ్ సంస్థ స్కై ట్రాక్స్ ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన విమానాశ్రయాలు ఏవీ టాప్-20లో చోటు దక్కించుకోలేకపోయాయి.

స్కైట్రాక్స్ వరల్డ్ బెస్ట్ ఎయిర్ పోర్ట్స్-2024 జాబితా టాప్-100లో భారత్ కు చెందిన నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 36వ స్థానం, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 59వ స్థానం, హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (శంషాబాద్ ఎయిర్ పోర్టు)కు 61వ స్థానం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 95వ స్థానం లభించాయి. 

బెంగళూరు ఎయిర్ పోర్టు గతేడాది 69వ ర్యాంకులో ఉండగా, ఈసారి 10 స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. శంషాబాద్ ఎయిర్ పోర్టు గతేడాది 65వ ర్యాంకులో నిలిచింది. ఈసారి నాలుగు స్థానాలు ఎగబాకింది. అదే సమయంలో ముంబయి విమానాశ్రయం 2023లో 84వ స్థానంలో ఉండగా, ఏకంగా 11 స్థానాలు పతనమైంది. 

ఇక, ఈ ర్యాంకింగ్స్ లో టాప్-10 లిస్టు చూస్తే... దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నెంబర్ వన్ విమానాశ్రయంగా నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో సింగపూర్ లోని ఛాంగీ ఎయిర్ పోర్టు ఉంది. 

దక్షిణ కొరియాలోని సియోల్ ఇంచియాన్ ఎయిర్ పోర్టుకు 3వ స్థానం, టోక్యోలోని హనీదా, నరీటా ఎయిర్ పోర్టులకు వరుసగా 4, 5వ స్థానాలు, పారిస్ లోని చార్లెస్ డి గాలే ఎయిర్ పోర్టుకు 6వ స్థానం, దుబాయ్ ఎయిర్ పోర్టుకు 7వ స్థానం, జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్ పోర్టుకు 8వ స్థానం, స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ ఎయిర్ పోర్టుకు 9వ స్థానం, తుర్కియేలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుకు 10వ స్థానం లభించాయి. 

అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఒక్కటి కూడా టాప్-20లో లేవు. సియాటిల్ లోని టకోమా విమానాశ్రయానికి 24వ ర్యాంకు లభించింది.

More Telugu News