Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కేసులో కీలక మలుపు..!
- ఈ కేసుతో సంబంధం ఉన్న మూడో నిందితుడి అరెస్ట్
- ఇప్పటికే పోలీసుల అదుపులో షూటర్లు విక్కీ గుప్లా, కుమార్ పాలక్
- ఈ కాల్పుల వెనుక ఉద్దేశం కేవలం సల్మాన్‌ను భయపెట్టడం మాత్రమేనన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట గత ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు వెలుగు చూసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడిని బుధవారం రాత్రి హర్యానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న షూటర్లు విక్కీ గుప్లా, కుమార్ పాలక్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మూడో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు, షూటర్లకు మధ్య సంధానకర్తగా పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సల్మాన్ ఇంటిముందు కాల్పులు జరిపేందుకు షూటర్లకు అతడు రూ. 4 లక్షలు సుపారీ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అడ్వాన్స్ రూపంలో రూ. 1 లక్ష షూటర్స్ కు ఇప్పటికే అందినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కాల్పుల వెనుక ఉద్దేశం కేవలం సల్మాన్ ను భయపెట్టడం మాత్రమేనని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
"సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరపడానికి ముందు నిందితులు పన్వేల్‌లోని కండలవీరుడి ఫామ్‌హౌస్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఆయనను భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కాల్పులు జరిపారు. సల్మాన్ ను హత్య చేయాలనే ఉద్దేశంతో కాదు. ఇద్దరు నిందితుల కుటుంబాల వాంగ్మూలాలు బిహార్‌లో నమోదు చేశాం. ఈ కేసు విచారణలో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురిని పిలిపించడం జరిగింది. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి" అని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు చెప్పారు.