Mamata Banerjee: మోదీ ప్రభుత్వం ఏకైక గ్యారెంటీ అల్లర్లు: మమతా బెనర్జీ విమర్శలు
- తాము గెలిస్తే ఎన్నార్సీ, సీఏఏ అమలు చేయమని ప్రకటించిన దీదీ
- ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్న మమత
- మమతా బెనర్జీ ట్వీట్‌పై బీజేపీ నేతల ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ గ్యారెంటీ అంటూ బీజేపీ ప్రచారం చేసుకోవడంపై ఆమె సెటైర్లు వేశారు. అల్లర్లు మాత్రమే వారి ఏకైక హామీ అంటూ విమర్శలు గుప్పించారు. అసోంలోని సిల్చార్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ... మోదీ ఎవరి కోసమో ఏమో చేస్తారనే నమ్మకం తనకు లేదన్నారు.
కానీ తాము గెలిస్తే మాత్రం రాష్ట్రంలో ఎన్నార్సీ, సీఏఏ అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు చాలా భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. ఇంతటి అవినీతి ఎన్నికలను మనం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదన్నారు. తాను ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు. అందరూ శాంతి, శ్రేయస్సు, అభివృద్థితో ముందుకు సాగాలని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. మమతా బెనర్జీ ట్వీట్‌పై బీజేపీ చురక అంటించింది. శాంతి సందేశాన్ని ఇవ్వడం మాత్రమే కాదని... దానిని పాటించాలని బీజేపీ సూచించింది.
రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ... మమతా బెనర్జీ శాంతిని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, కానీ శ్రీరామ నవమి రోజున ఇలాంటి సందేశం ఈ పండుగను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల పండుగల సమయంలోనూ ఆమె ఇలాంటి సందేశాన్ని ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. భారతీయతను, సనాతన ధర్మాన్ని ఆమె కించపరుస్తున్నారని విమర్శించారు. గత ఏడాది రామనవమికి ముందు మమతా బెనర్జీ రెచ్చగొట్టే మతపరమైన ప్రసంగాలు చేశారని, ఆ సమయంలో హింస కూడా జరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అంతకుముందు అన్నారు.