Chandrababu: బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నా: చంద్రబాబు

Chandrababu said he condemns conspiracy against Bonda Uma
  • విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • బోండా ఉమపై ఆరోపణలు 
  • అధికార పార్టీ నీచమైన డ్రామాలు ఆడుతోందన్న చంద్రబాబు
  • తప్పు చేసే అధికారులూ... బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ 
సీఎంపై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నానని తెలిపారు. తప్పు చేసే అధికారులూ... బీకేర్ ఫుల్... మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. 

‘‘ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలకు వైసీపీ తెరలేపింది. హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద వేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజలు ఛీ కొట్టడంతో ఆ పార్టీ పీకల్లోతు బురదలో కూరుకుపోయింది. 

నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారు. వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయారు. దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. అసలు... రాయి విసిరింది ఎవరు... కారణాలు ఏంటి... వాస్తవాలు ఏమిటో చెప్పకుండా మళ్లీ కుట్రలకు ప్రభుత్వం నీచపు ప్రయత్నాలు చేస్తోంది. 

టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పడం కోసం, నమ్మించడం కోసం పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టీడీపీ ముఖ్యనేతలను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో పావులు కదుపుతోంది. 

దీనికోసం నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను కేసులో ఇరికించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. కీలక ఎన్నికల సమయంలో బోండా ఉమా ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోంది. 

ఈ ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదు. నేడు మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం... అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా... జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో చాలా కఠినంగా శిక్షించబడతారు. 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలి. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణ బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chandrababu
Bonda Uma
Stone Attack On Jagan
TDP
YSRCP

More Telugu News