TSRTC: ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
- మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
- ప్రయాణికులు లేకపోవడంతో సర్వీసులు తగ్గించాలని నిర్ణయం
- మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బస్సుల సంఖ్య కుదింపు
తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తుండడంతో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు, రేపు అయితే ఎండలు మరింత మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వీసులు తగ్గించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో సర్వీసులను కుదిస్తున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపటి నుంచి బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు.