RCB: సన్‌రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఘోర ఓటమిపై టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి సంచలన వ్యాఖ్యలు
- ఆర్సీబీ ఫ్రాంచైజీని కొత్త యాజమాన్యానికి విక్రయించాలన్న మహేశ్ భూపతి
- క్రికెట్, క్రికెటర్లు, ఫ్యాన్స్ కోసం బీసీసీఐ రంగంలోకి దిగాలని సూచన
- ఆ జట్టు ప్రస్తుత పరిస్థితి విషాదకరమని వ్యాఖ్య
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐపీఎల్ చరిత్రను బద్దలుకొడుతూ 287 పరుగులు బాదడంతో ఆర్సీబీపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ జట్టు బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి రుజువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల ప్లేయర్లు కూడా స్పందించారు. తాజాగా భారత టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి ఆర్సీబీ ఆటతీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొత్త యాజమాన్యానికి విక్రయించాలని, ఈ మేరకు బీసీసీఐ ప్రక్రియను ప్రారంభించాలని మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ ప్రస్తుత పరిస్థితి విషాదకరమని, బీసీసీఐ రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. సరైన ఫ్రాంచైజీని నిర్మించడంపై శ్రద్ధ వహించే కొత్త యజమానికి జట్టు విక్రయించే దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. క్రికెట్ కోసం బీసీసీఐ ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ఆట, ఐపీఎల్, ఫ్యాన్స్, ఆటగాళ్ల కోసం ఆర్సీబీ విక్రయాన్ని బీసీసీఐ చేపట్టాల్సిన అవసరం ఉందని, తాను ఈ విధంగా భావించడం శోచనీయమే అయినప్పటికీ తప్పదని పేర్కొన్నాడు. ఈ మేరకు మహేశ్ భూపతి ట్వీట్ చేశాడు.
కాగా ఆర్సీబీ ప్రస్తుత సీజన్‌లో అత్యంత కఠినమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. లూకీ ఫెర్గూసన్, రీస్ టోప్లీ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఆ జట్టులో ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు ఆ జట్టు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటోంది. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆ జట్టుని ఊచకోత కోశారు. 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 287 పరుగులు బాదారు. భారీ లక్ష్య ఛేదనలో దినేశ్ కార్తీక్, డుప్లెసిస్ రాణించినప్పటికీ ఆ జట్టుకి ఓటమి తప్పలేదు.