Ola S1X: ఓలా ఎస్1ఎక్స్ మోడల్ ఈ-స్కూటర్ ధరపై 12 శాతం తగ్గింపు
- రూ.79,999 నుంచి రూ.69,999లకు తగ్గింపు
- ఈ-స్కూటర్ల విక్రయాలపై ప్రభుత్వ సబ్సిడీ తగ్గింపు నేపథ్యంలో ఓలా కీలక నిర్ణయం
- కొనుగోళ్లను ప్రోత్సహించడమే లక్ష్యం బేస్ మోడల్ ధర భారీగా కుదింపు
ఇండియాలనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారుగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సోమవారం కీలక ప్రకటన చేసింది. సరసమైన ధర వేరియంట్‌గా ఉన్న ఎస్1ఎక్స్ మోడల్ ఈ-స్కూటర్ ధరను ఏకంగా 12.5 శాతం మేర తగ్గించింది. ఎస్1ఎక్స్ మోడల్ మునుపటి ధర రూ.79,999గా ఉండగా రూ.69,999లకు తగ్గిందని ఓలా ఎలక్ట్రిక్ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఎస్1ఎక్స్‌లోని వేరియంట్లను బట్టి ధరలపై 5.6 శాతం నుంచి 9.1 శాతం మధ్య అదనపు తగ్గింపు ఉంటుందని తెలిపారు.
నష్టాల బాటలో పయనిస్తున్న సమయంలో ఓలా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలపై ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో అమ్మకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓలాపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని, అందుకే రేట్లను తగ్గించి ఉండొచ్చని ఎలక్ట్రిక్ వాహనరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఓలా ఇప్పటికే ఎస్1ఎక్స్ శ్రేణిలోని అధిక రేట్ల వేరియంట్లను నష్టానికి విక్రయిస్తోందని, బేస్ వేరియంట్‌ను కూడా తక్కువ ధరకు విక్రయించడం ఆర్థికంగా సాధ్యం కాదని, తాజా తగ్గింపు నిర్ణయం ఆచరణ సాధ్యం కాకపోవచ్చునని ముంబైకి చెందిన ఓ వ్యాపార నిపుణుడు విశ్లేషించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓలా కంపెనీ ఆర్థిక సంవత్సరం 2024లో 326,443 ఈ-స్కూటర్లు ర్‌లను విక్రయించింది. ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఓలా మార్కెట్ వాటా 35 శాతగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో టీవీఎస్ 19 శాతం, ఎథర్ 12 శాతం చొప్పున మార్కెట్ వాటాను కలిగివున్నాయి.