Balakrishna: మీ ఓటు కూటమికే వేయాలి... ఇది అభ్యర్థన కాదు: కర్నూలులో బాలకృష్ణ

Balakrishna appeals people must vote for alliance

  • స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
  • ఇవాళ కర్నూలులో సభ
  • జగన్ పాలనలో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిపోయిందని విమర్శ 
  • జగన్ ను గద్దె దించే వరకు గుండె మంట ఆరకూడదని  పిలుపు
  • ఓ భారీ డైలాగ్ తో అలరించిన బాలయ్య 

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ కర్నూలులో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ పాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లిపోయిందని, ఇలాంటి సమయంలో కేంద్రం సహకారం అవసరమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని వెల్లడించారు. 

ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనేక కష్టనష్టాలు ఎదురైనప్పటికీ, ఎంతో ఆత్మస్థైర్యంతో పార్టీని నడిపిస్తూ, టీడీపీతో చేతులు కలిపారని, బీజేపీ కూడా పొత్తులో కలిసిందని వివరించారు. జగన్ ను ఓడించేదాకా తెలుగు పౌరుషం నిద్రపోరాదని పిలుపునిచ్చారు. మీ ఓటు కూటమికే వేయాలి... ఇది అభ్యర్థన కాదు... ఇది ప్రతి ఒక్క తెలుగువాడి గుండె మంట... అతడికి గుణపాఠం చెప్పి ఇంటికి తరిమే వరకు ఆ మంట ఆరకూడదని అన్నారు. 

మన భవిష్యత్ కోసం, మన భావితరాల భవిష్యత్ కోసం మనమంతా ఇలాగే ఐక్యంగా ఉండాలని బాలయ్య అభిలషించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఓ భారీ డైలాగ్ చెప్పి అలరించారు. 

"రక్తానికి జాతి లేదు... మాంసానికి మతం లేదు... చర్మానికి కులం లేదు... నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణుడ్ని, ఐశ్వర్యంలో వైశ్యుడ్ని, మంచికి మాలను, ఎదురుతిరిగితే మాదిగను, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుడ్ని, నాయి బ్రాహ్మణుడ్ని, కల్లుగీత కార్మికుడ్ని, కల్మషం లేని యాదవుడ్ని, ఆపదలో ఆదుకునే వెలమను, వ్యక్తిత్వంలో రాజును, అమ్మని మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని... అని మీలో ప్రతి ఒక్కరూ అనుకోవాలి. 

మతాలు, కులాలు... ఇవి కాదు మనకు కూడు పెట్టేది. ఇవాళ హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి... ఒక వసుధైక కుటుంబంలా అందరం కలిసున్నాం. మనలో ఎవరైనా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే, వాళ్లు చచ్చేదాకా వదిలిపెట్టం అని ఈ సభాముఖంగా శపథం పూనండి" అంటూ బాలయ్య ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

More Telugu News