YS Sharmila: బీజేపీతో టీడీపీ పొత్తు.. మోదీకి జగన్ తొత్తు: షర్మిల

Sharmila fires on Jagan

  • రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారన్న షర్మిల
  • నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలను నాశనం చేశారని మండిపాటు
  • ప్రత్యేక హోదాను సాధించలేక పోయారని విమర్శ

ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని... రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఇంత మంది ఎంపీలను పెట్టుకుని హోదాను ఎందుకు సాధించలేక పోయారని ప్రశ్నించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి మద్యం వ్యాపారంలో బాగా సంపాదించారని షర్మిల విమర్శించారు. నాసిరకం మద్యం అమ్ముతూ  వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని... ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని కోరారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే... మోదీకి జగన్ తొత్తుగా మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి వైఎస్సార్ ఆకాంక్ష అని... ఆయన ఆకాంక్ష నెరవేరాలని చెప్పారు.

YS Sharmila
Congress
JAG
YSRCP
  • Loading...

More Telugu News