Sajjala Ramakrishna Reddy: దాడి జరిగింది సీఎం జగన్ మీద... మీకెందుకంత తాపత్రయం?: విపక్షాలపై సజ్జల ఫైర్

Sajjala slams opposition parties

  • సీఎం జగన్ పై రాయి దాడి
  • డ్రామా అంటున్న విపక్షాలు
  • సీఎం జగన్ కు లభిస్తున్న ఆదరణ చూసి విపక్షాలు భయపడుతున్నాయన్న సజ్జల

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన పట్ల విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసిన తర్వాత, తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలకు అర్థమైందని అన్నారు. అందుకే సీఎం జగన్ పై రాయి దాడి ఘటనను డ్రామా అంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగితే, విపక్షాలన్నీ ఒకే తీరున మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. 

"దాడి జరిగింది మీ మీద కాదు. చంద్రబాబు మీదో, పవన్ కల్యాణ్ మీదో... ఇతర విపక్ష నేతల మీదో కాదు. వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో మాజీ మంత్రి, శాసనసభ్యుడు వెల్లంపల్లికి కూడా గాయమైంది. 

ఈ ఘటనలో మేం బాధితులం. దీని గురించి మొదట మాట్లాడే హక్కు మాకు ఉంటుంది. దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. మరి విపక్షాలకు ఎందుకంత తాపత్రయమో అర్థం కావడంలేదు. ఇందులో ఏం వైఫల్యం ఉందో చెప్పడానికి మీరెవరు? నింద మీ మీదకు వస్తుందని తెలుగుదేశం పార్టీకి భయం. 

రాయి విసిరిన దానిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సహజంగానే అనుమానం టీడీపీకి పైకి మళ్లుతుంది... అదే మేం వ్యక్తీకరించాం. మేం దాడి చేయలేదు అని వివరణ ఇచ్చుకోండి... అంతే తప్ప ఇదంతా డ్రామా అనడం, సీబీఐ విచారించాలి అనడం చూస్తుంటే టీడీపీ భయపడుతున్నట్టు అర్థమవుతోంది" అని సజ్జల వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy
Jagan
Stone Attack On Jagan
YSRCP
TDP
Janasena
  • Loading...

More Telugu News