Bhagwant Singh Mann: జైలులో కేజ్రీవాల్‌ను కలిసిన పంజాబ్ సీఎం.. బయటకు వచ్చి కీలక వ్యాఖ్యలు!
- తీహార్ జైలులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భగవంత్ మాన్ భేటీ
- కరడుగట్టిన నేరగాళ్లకు కూడా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఆయనకు అందడం లేదన్న పంజాబ్ సీఎం
- ప్రధాని మోదీకి ఏం కావాలంటూ మండిపడ్డ భగవంత్ మాన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ కలిశారు. అనంతరం పంజాబ్ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. "కరడుగట్టిన నేరగాళ్లకు కూడా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఆయనకు అందకపోవడం బాధాకరం. ఆయన తప్పు ఏమిటి? దేశంలోనే అతిపెద్ద టెర్రరిస్టుల్లో ఒకరిని పట్టుకున్నట్లుగా మీరు ఆయనతో వ్యవహరిస్తున్న తీరు ఎంతో బాధకరం. ప్రధాని మోదీకి ఏం కావాలి? పారదర్శకత రాజకీయాలకు శ్రీకారం చుట్టి, బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలకు ముగింపు పలికిన కేజ్రీవాల్‌తో ఇలా వ్యవహరించడంపట్ల బాధగా ఉంది. ఆయనను ఎలా ఉన్నారు అని నేను అడిగితే.. నా విషయం వదిలేయ్, పంజాబ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పు అని అన్నారు. ఆప్ క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందరం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం. జూన్ 4న వచ్చే ఫలితాల తర్వాత ఆప్ పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుంది" అని భగవంత్ మాన్ చెప్పుకొచ్చారు.