Maldives: మాల్దీవుల్లో కొనసాగుతున్న భారత దళాల ఉపసంహరణ
- కొంతకాలంగా మాల్దీవుల్లో భారత సైన్యం కార్యకలాపాలు
- భారత సైన్యం తమ దేశం నుంచి వెళ్లిపోవాలన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
- ఇప్పటికే వెనక్కి వచ్చేసిన ఓ బృందం
- ఏప్రిల్ 9న రెండో బృందం ఉపసంహరణ
గత కొంతకాలంగా మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలు ఏమంత సజావుగా లేవు. గత నవంబరులో మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక... మాల్దీవుల ప్రభుత్వం భారత వ్యతిరేక గళం వినిపించడం మొదలుపెట్టింది.
సుహృద్భావ చర్యల కింద మాల్దీవుల్లో గత కొన్నాళ్లుగా భారత సైన్యం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్లను భారత సైన్యమే నిర్వహిస్తోంది.
అయితే, మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహ్మద్ ముయిజ్జు భారత సైన్యం తమ దేశానికి వదలి వెళ్లిపోవాలంటూ డెడ్ లైన్ (మార్చి 15) విధించారు. ఈ నేపథ్యంలో, భారత్... మాల్దీవుల గడ్డపై ఉన్న తన సైన్యాన్ని దశలవారీగా ఉపసంహరిస్తోంది.
ఇప్పటికే ఒక విడత భారత సైనికుల బృందం మాల్దీవుల నుంచి వచ్చేసింది. ఏప్రిల్ 9న రెండో విడతలో మరికొందరు భారత సైనికులు వెనక్కి వచ్చేశారు. వీరిలో హెలికాప్టర్ నిర్వహణ సిబ్బంది ఉన్నారని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు వెల్లడించారు. ఇక ఒక బృందం మాత్రమే మాల్దీవుల్లో మిగిలుందని, ఆ బృందం కూడా మే 10వ తేదీ లోపు వెళ్లిపోతుందని వివరించారు.
ఓ కార్యక్రమంలో ముయిజ్జు మాట్లాడుతూ, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలి పదవిలో ఉన్నప్పుడు ఓ విదేశీ రాయబారి ఆదేశాలకు లోబడి పాలన సాగించాడని విమర్శించారు. భారత్ ను ఉద్దేశించే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మాల్దీవులు ఇటీవల కాలంలో చైనాకు దగ్గరవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైనా అండ చూసుకునే మాల్దీవులు సార్వభౌమత్వం పేరిట భారత్ ను ధిక్కరిస్తోందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఇటీవల లక్షద్వీప్ రగడతో మాల్దీవుల నేతల వైఖరి బట్టబయలైంది.