Arvind Kejriwal: తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారు... భార్యను కూడా నేరుగా కలవనీయలేదు: ఆప్ నేత సంజయ్ సింగ్
- జైల్లో కేజ్రీవాల్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్న సంజయ్ సింగ్
- కేజ్రీవాల్ హక్కులను కాలరాయవద్దంటూ విజ్ఞప్తి
- మూడుసార్లు సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌ను భార్య గ్లాస్ కిటికీ ద్వారా కలుసుకోవాల్సి వచ్చిందని ఆవేదన
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు జైలు యంత్రాంగం నిరాకరించిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'జైల్లో కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారు. ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తన భర్తను కలుసుకోవడానికి కూడా సునీతా కేజ్రీవాల్‌ను అనుమతించడం లేద'ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.
'ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈరోజు మేం పోరాటం చేస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ హక్కులను కాలరాయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరుతున్నాను. నియంతల్లా ఉండవద్దు' అని కోరారు. కేజ్రీవాల్‌ను కలవాలని ఆయన భార్య దరఖాస్తు చేసుకున్నారని, కానీ ముఖాముఖిగా ఆయనను కలవలేరని ఆమెకు సమాధానం వచ్చిందన్నారు. ఇంత అమానవీయ ప్రవర్తన ఎందుకు? అని సంజయ్ సింగ్ నిలదీశారు. ముఖ్యమంత్రి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్‌ను ఆయన భార్య జైల్లో ఓ గ్లాస్ ఉన్న కిటికీలో నుంచి కలవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
సునీతా కేజ్రీవాల్ కిటికీలో నుంచి మాత్రమే కేజ్రీవాల్‌ను కలువవచ్చునని జైలు అధికారులు చెప్పారని తెలిపారు. కేజ్రీవాల్‌ను అవమానించేందుకు ఇలా చేశారన్నారు. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం కేసులోనే సంజయ్ సింగ్ గత ఏడాది అక్టోబర్‌లో అరెస్ట్ అయ్యారు. ఈ నెలలో బెయిల్ పైన విడుదలయ్యారు.