CV Anand: మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదు: ఏసీబీ డీజీ సీవీ ఆనంద్
- స్పాన్సర్లు క్రికెట్ విషయంలో స్పందించినట్టు ఇతర క్రీడల విషయంలో స్పందించడం లేదన్న సీవీ ఆనంద్
- ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న డీజీ
- ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపు
- ఎఫ్ఎన్‌సీసీలో టెన్నిస్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేకపోవడం బాధాకరమని తెలంగాణ అవినీతి నిరోధకశాఖ డీజీ సీవీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో సీబీ రాజు మెమోరియల్ పురుషుల విభాగం టెన్నిస్ టోర్నీ విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక స్తోమత లేని కారణంగా ప్రతిభ ఉన్నప్పటికీ చాలామంది టెన్నిస్, ఇతర క్రీడల్లో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. క్రికెట్ విషయంలో స్పందించినట్టుగా ఇతర క్రీడలకు స్పాన్సర్లు స్పందించడం లేదని అన్నారు. పుట్‌బాల్, టెన్నిస్ సహా పలు రకాల క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు ఆర్థిక భరోసా లేకపోతే క్రీడలు మరుగున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సానియా మీర్జా మాట్లాడుతూ ఒక ప్రాంతం నుంచి మరో చోటికి వెళ్లేందుకు డబ్బులు కూడా లేక క్రీడాకారులు ఆటలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వారం పాటు జరిగిన సీబీ రాజు మెమోరియల్ పురుషుల విభాగం టెన్నిస్ టోర్నీడబుల్స్ విభాగంలో , ఒడిశాకు చెందిన కబీర్ హన్స్ విజేతగా నిలవగా, ఢిల్లీకి చెందిన రిక్కీ చౌదరి రన్నరప్‌గా నిలిచారు. సింగిల్స్ విభాగంలో గుజరాత్ ఆటగాడు దేవ్ జాబియా గెలుపొందగా, జే విష్ణవర్ధన్ రన్నరప్‌గా నిలిచాడు. కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, స్పోర్స్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్, కార్యదర్శి ముళ్ళపూడి మోహన్ తదితరులు పాల్గొన్నారు.