Jaishankar: ఉగ్రవాదంపై పోరుకు రూల్స్ ఏంటి?: జైశంకర్
- 2014 నుంచి మన రియాక్షన్ లో మార్పు వచ్చిందని వ్యాఖ్య
- ప్రస్తుతం విదేశాంగ విధానం కరక్ట్ గా ఉందని వివరణ
- పూణెలో యువతతో భేటీ అయిన విదేశాంగ మంత్రి
ఉగ్రవాదంపై, ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ ఏంటని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రశ్నించారు. దాడి చేయాలనే విషయం తప్ప ఉగ్రవాదులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని, అలాగే వారికి బదులిచ్చే సమయంలో భారత్ కూడా ఎలాంటి రూల్స్ గురించి ఆలోచించబోదని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ఈమేరకు పూణెలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి జైశంకర్ స్థానిక యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. మన పొరుగు దేశం పాకిస్థాన్ తో సత్సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాలేనని అంగీకరించారు. ఉగ్రవాదం విషయంలో రెండు దేశాల స్పందన వేర్వేరుగా ఉంటుందని గుర్తుచేశారు.
సరిహద్దుల్లో పాక్ దుందుడుకు చర్యలకు కారణం వాస్తవానికి మనమేనని, మొదట్లోనే తగిన విధంగా జవాబిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని మంత్రి జైశంకర్ చెప్పారు. 1947లో పాకిస్థాన్ మన కశ్మీర్ లోని భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పారు. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు భారత బలగాలు పోరాడుతుంటే అప్పటి ప్రభుత్వం వారిని నిలువరించిందని, పంచాయతీ కోసం ఐక్యరాజ్య సమితి వద్దకు వెళ్లిందని వివరించారు. అదికూడా పాక్ మా దేశ భూభాగాన్ని ఆక్రమించిందని కాకుండా ఆదివాసీలు కశ్మీర్ భూభాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. అప్పట్లోనే చొరబాటుదారులకు గట్టిగా బుద్ధి చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
భారత విదేశాంగ విధానంలో 2014 నుంచి మార్పులు చోటుచేసుకున్నాయని, టెర్రరిజానికి, టెర్రరిస్టులకు దీటుగా జవాబిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇకపైనా మన విదేశాంగ విధానం ఇలాగే ఉంటుందని, టెర్రర్ దాడుల్లో మార్పులకు అనుగుణంగా మన విధానాలు కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయని వివరించారు. ముంబై దాడుల వంటి ఘోరాలు జరిగినపుడు ప్రతిస్పందన దీటుగా ఉంటేనే మరోసారి అలాంటి ఘోరం జరగకుండా అడ్డుకోగలమని మంత్రి గుర్తుచేశారు. ముంబై దాడి జరిగిన సమయంలో జరిగిన ప్రాణ నష్టం చూసి ప్రతీ భారతీయుడూ మన దేశం గట్టిగా జవాబివ్వాలని కోరుకున్నాడని జైశంకర్ చెప్పారు.