Ram Charan: రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రకటించిన చెన్నై వేల్స్ యూనివర్సిటీ
- సినీ రంగంలోను, సామాజిక పరంగానూ రామ్ చరణ్ సేవలకు గుర్తింపు
- ఈ నెల 13న చెన్నైలోని పల్లవరంలో వర్సిటీ స్నాతకోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో మరో ఘనత చేరనుంది. చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న చెన్నైలోని పల్లవరంలో వేల్స్ వర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ అధ్యక్షుడు డీజీ సీతారాం... రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
సినీ రంగంలోనూ, సామాజికంగానూ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ డాక్టరేట్ కు రామ్ చరణ్ ను ఎంపిక చేశారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన రామ్ చరణ్... అక్కడ్నించి వెనుదిరిగి చూడలేదు. తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు అందుకున్నారు.
కాగా, ఇదే వేల్స్ యూనివర్సిటీ ఈ ఏడాది జనవరిలో జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా డాక్టరేట్ ప్రకటించింది. అయితే, వివిధ రంగాల్లో రాణించిన వారు తనకంటే ఎక్కువ మంది ఉన్నారని... తాను ఈ డాక్టరేట్ ను స్వీకరించలేనని పవన్ సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు, ఎన్నికల హడావిడి కారణంగా వర్సిటీ స్నాతకోత్సవానికి కూడా హాజరు కాలేనని తెలిపారు.