Maoists: మాపై వైమానిక దాడులు.. మావోయిస్టుల సంచలన ఆరోపణలు
- ఈ నెల 7న బస్తర్ ఏరియాలోని పామేడులో ఎయిర్ స్ట్రయిక్స్
- సౌత్ బస్తర్ మావోయిస్టు కార్యదర్శి పేరుతో లేఖ
- బీజాపూర్ సరిహద్దుల్లో రాకెట్ లాంఛర్లతో దాడి చేశారని ఆరోపణ
మావోయిస్టుల అణచివేత విషయంలో ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం తమపై వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు సంచలన ఆరోపణలు చేశారు. బస్తర్ రీజియన్ లో ఈ నెల 7న భద్రతా బలగాలు తమపై వైమానిక దాడి చేశారని సౌత్ బస్తర్ మావోయిస్టు కార్యదర్శి గంగ పేరుతో ఓ లేఖ విడుదలైంది. రాకెట్ లాంఛర్లతోనూ దాడులకు పాల్పడుతున్నారని లేఖలో గంగ ఆరోపించారు. పామేడు ఏరియాలో తమపై వైమానిక దాడులు, సుకుమా బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో రాకెట్ లాంఛర్లను ఆదివాసీ పల్లెలపై ప్రయోగించారని మండిపడ్డారు. ఈ ఆరోపణలకు సంబంధించి గంగ కొన్ని ఫొటోలను కూడా విడుదల చేశారు.
ఇటీవల ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లు చోటుచేసుకోవడం తెలిసిందే. వెంటవెంటనే జరుగుతున్న ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో అటు పూజారి కాంకేర్, ఇటు ములుగు జిల్లా కర్రి గుట్టల వద్ద ఇటీవల భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్ కు వారం రోజుల ముందు బీజాపూర్ జిల్లా బాసగూడలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఇదే జిల్లాలోని కోర్చోలిలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరుస ఎన్ కౌంటర్లతో సరిహద్దుల్లోని ఆదివాసీలు భయాందోళనలకు గురవుతున్నారు.