KTR: ఆ విషయంలో ఈటల రాజేందర్ బాధపడుతున్నారట: కేటీఆర్
- రైతు రుణమాఫీ విషయంలో ఈటల బాధపడుతున్నారన్న కేటీఆర్
- మోదీ బడా వ్యాపారులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారన్న కేటీఆర్
- రైతులకు మాత్రం ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శ
- రాముడు అందరివాడు... మనకు బీజేపీతో మాత్రమే పంచాయతీ అని వ్యాఖ్య
రైతు రుణమాఫీ విషయంలో మల్కాజ్‌గిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ బాధపడుతున్నారట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీ బడా వ్యాపారులకు చెందిన పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని, కానీ రైతులకు సంబంధించి ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. ఈ పదేళ్లు ఏం చేశారని ప్రశ్నిస్తే చెప్పేందుకు బీజేపీ నేతల వద్ద ఏమీ లేదన్నారు. అందుకే రైతు రుణమాఫీ విషయంలో ఈటల రాజేందర్ బాధపడుతున్నారట అన్నారు.
కరోనా సమయంలో కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కనీసం ఉచిత రైళ్లు పెట్టలేదన్నారు. కేసీఆర్ మాత్రం 180 రైళ్లు పెట్టించి బీహార్, యూపీ ప్రజలను వారి రాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు. మనసు లేని మోదీ ఆ పని కూడా చేయలేకపోయాడని విమర్శించారు. నోట్ల రద్దు చేసి దేశాన్ని ఆగం చేశాడన్నారు. వీటిని అన్నింటిని మరిచిపోవద్దన్నారు. పెద్ద పెద్ద సేట్లకు పని చేసే మోదీ... మనకు, తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు.
శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తే జైశ్రీరాం అంటారని విమర్శించారు. మనం రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదామని పిలుపునిచ్చారు. రాముడు బీజేపీ పార్టీ వాడు కాదని... ఆయన అందరి వాడన్నారు. ఆయన లోక ప్రియుడు... అలాంటి రాముడితో మనకు తగాదా లేనేలేదన్నారు. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని తరిమేయాలని వ్యాఖ్యానించారు.
తెలంగాణపై బీజేపీకి ప్రేమ ఉంటే భద్రాచలం ఆలయానికి ఒక్కరూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అయోధ్య రాముడే రాముడా? భద్రాచలం రాముడు రాముడు కాదా? ఘట్కేసర్‌లో రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ఒక్క రూపాయి అయినా కిషన్ రెడ్డి ఇచ్చారా? ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీజేపీకి ఓటు వేద్దామా? అని ప్రశ్నించారు. మనం యాదాద్రిని అంతగా అభివృద్ధి చేసి కూడా రాజకీయంగా వాడుకోలేదన్నారు. దేవుడు దేవుడే.. ధర్మం ధర్మమే.. రాజకీయం రాజకీయమే అని వ్యాఖ్యానించారు. ఎవరు మన కోసం పని చేస్తున్నారో.. ఎవరు దేవుళ్లను అడ్డంపెట్టుకుని బతుకుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు.