Pandit Keshav Dev: మెడలో చెప్పుల దండతో లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల ప్రచారం..!
![Independent candidate from Aligarh Pandit Keshav Dev campaigns wearing garland of slippers](https://imgd.ap7am.com/thumbnail/cr-20240410tn66164d9248f48.jpg)
- యూపీలోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో పండిట్ కేశవ్ దేవ్
- ఆయనకు చెప్పుల జత గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం
- తనకు కేటాయించిన గుర్తుతో వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్న కేశవ్ దేవ్
ఎన్నికల సమయంలో వివిధ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులు చాలా వెరైటీగా ఉంటాయి. ఇక తమకు కేటాయించిన గుర్తులను అభ్యర్థులు ప్రచారంలో వాడుకునే తీరు మరింత ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చెప్పుకోబోయే లోక్‌సభ అభ్యర్థి ఇదే కోవకు చెందినవారు. యూపీలోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పండిట్ కేశవ్ దేవ్ అనే వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు ఎన్నికల సంఘం తాజాగా చెప్పుల జత గుర్తును కేటాయించింది. దాంతో ఆయన ఏడు పాదరక్షలు కట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుతో వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారాయన.
ఇక ఓటర్లకు తన గుర్తు బాగా గుర్తుండిపోవాలనే తాను ఈ విధంగా వినూత్న ప్రచారం చేస్తున్నట్లు కేశవ్ దేవ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ లోక్‌సభ అభ్యర్థి వెరైటీ ఎన్నికల ప్రచారం తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన మెడలో చెప్పుల హారం, తెల్లటి తలపాగాను ధరించి కనిపించారు. అతని చుట్టూ మద్దతుదారులు ఉన్నారు. వారిలో ఒకరు ' సమర్థిత్ భ్రష్టాచార వ్యతిరేక సేన' (అవినీతి నిరోధక సైన్యం) అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని కనిపించారు .
కాగా, అలీగఢ్ నియోజకవర్గానికి రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సతీశ్ కుమార్ గౌతమ్ 2,25,000 భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపొందారు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన అజిత్ బలియన్కు 4,26,954 ఓట్లు వస్తే.. సతీశ్ కుమార్‌కు 6,56,215 ఓట్లు వచ్చాయి. ఇక యూపీలో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే. దాంతో యూపీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు విడతల్లో కొనసాగనుంది.