America Gun Fire: తమపై కాల్పులు జరిపిన కారు డ్రైవర్ ను కాల్చి చంపిన అమెరికా పోలీసులు.. వీడియో ఇదిగో!

Chicago Police fires 96 shots in 41 seconds at car driver

  • సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రశ్నించగా తుపాకీ తీసి డ్రైవర్ కాల్పులు
  • 41 సెకన్లలో 96 రౌండ్ల కాల్పులు జరిపిన నలుగురు పోలీసులు
  • స్పాట్ లోనే డ్రైవర్ మృతి.. ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు

సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడుపుతున్న ఓ డ్రైవర్ ను పోలీసులు అడ్డగించారు.. దీంతో పోలీసులతో వాగ్వాదం చేసిన సదరు డ్రైవర్ కోపం పట్టలేక తన గన్ తీసి కాల్పులు జరిపాడు. వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి డ్రైవర్ ను మట్టుబెట్టారు. కేవలం 41 సెకన్లలో నలుగురు పోలీసులు 96 రౌండ్ల కాల్పులు జరిపారు. అమెరికాలోని షికాగోలో గత నెల 21 న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షికాగోలోని హంబోల్డ్ పార్క్ సమీపంలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు ఓ కారును అడ్డగించారు. డ్రైవర్ డెక్సటర్ రీడ్ (26) సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపుతుండడంతో కారును ఆపాలని కోరారు. అయినా రీడ్ వినిపించుకోకపోవడంతో నాలుగు వాహనాలతో చుట్టుముట్టి కారు కదలకుండా అడ్డుకున్నారు. ఆపై డ్రైవింగ్ సీట్ లో ఉన్న రీడ్ ను కిందికి దిగాలని ఆర్డర్ వేయగా.. రీడ్ నిరాకరించాడు. పోలీసులతో వాదనకు దిగాడు. ఇది కాస్తా ముదరడంతో పోలీసులు గన్ తో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో రీడ్ ఆవేశం పట్టలేక తన గన్ తీసి పోలీసులపైకి కాల్పులు జరిపాడు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు తీశారు.

ఓ అధికారికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే తేరుకున్న పోలీసులు రీడ్ కారుపై కాల్పులు జరిపారు. నలుగురు పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో రీడ్ డ్రైవింగ్ సీటులో నుంచి రోడ్డు మీద పడిపోయాడు. అయినా పోలీసులు కాల్పులు ఆపలేదు. కాసేపటి తర్వాత రీడ్ లో కదలికలు లేకపోయేసరికి దగ్గరికి వెళ్లి పరీక్షించగా.. రీడ్ అప్పటికే చనిపోయాడు. ఈ ఘటన మొత్తం ఓ పోలీస్ అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో చనిపోయిన డ్రైవర్ రీడ్ కుటుంబ సభ్యులు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News