YS Sharmila: జగన్ సర్కారుకు ఈ ఘటన సిగ్గుచేటు: షర్మిల

YS Sharmila Tweet On Jagan Govt Failure

  • బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లిన తండ్రి వార్త క్లిప్పింగ్ ట్వీట్
  • పేదల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం ఎందుకని నిలదీత
  • రాజన్న పాలన అంటే ఇలానే ఉంటుందా అని ప్రశ్నించిన ఏపీసీసీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కనీస అవసరాలను తీర్చలేకపోతోందని, ఇలాంటి ప్రభుత్వం అవసరమా? అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మేం అది చేశాం, ఇది చేశామని డబ్బాలు కొట్టుకోవడం కాదు పేదల కష్టాలు తీర్చాలని జగన్ సర్కారుపై మండిపడ్డారు. బిడ్డ మృతదేహాన్ని భుజాన మోస్తూ ఓ తండ్రి కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వేయండంటూ అడిగే వాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం అటకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు ఎలాగూ అందడంలేదు, కనీసం మృతదేహాన్ని ఇంటికి చేర్చే దిక్కు కూడా లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 

రోడ్డు సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ ఓ తండ్రి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కథనం మీడియా ప్రచురించింది. ఈ వార్తా కథనాన్ని ట్వీట్ చేస్తూ జగన్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. రాజన్న బిడ్డనని, ఆంధ్రప్రదేశ్ లో రాజన్న పాలన అందిస్తున్నానని జగన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాజన్న పాలన అంటే ఇలానే ఉంటుందా? అని షర్మిల నిలదీశారు. ‘అందుకే చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో అధికార పార్టీకి బుద్ది చెప్పండి’ అంటూ రాష్ట్ర ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు.

YS Sharmila
APCC President
Andhra Pradesh
Jagan Govt
YSRCP
Congress

More Telugu News