Unicorns: విదేశాల్లోనే అత్యధిక యూనికార్న్‌లను స్థాపించిన భారతీయులు
- మిగతా దేశాల వారితో పోలిస్తే నెం.1గా నిలిచిన వైనం
- గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్-2024 నివేదికలో వెల్లడి
- విదేశాల్లో 109 యూనికార్న్‌లకు సహ వ్యవస్థాపకులుగా భారతీయులు
- దేశీయంగా 67 స్టార్టప్‌లను నెలకొల్పిన వైనం
విదేశాల్లో అత్యధికంగా స్టార్టప్‌లు ప్రారంభించిన వారిలో భారతీయులు టాప్‌లో నిలిచారు. హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్-2024లో ఈ విషయం తెలిసింది. ఈ నివేదిక ప్రకారం, ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులు విదేశాల్లో అత్యధికంగా 109 యూనికార్న్‌లకు సహవ్యవస్థాపకులుగా ఉన్నారు. దేశీయంగా మాత్రం కేవలం 67 యూనికార్న్‌లను ఏర్పాటు చేశారు. బిలియన్ డాలర్లకు పైబడి మార్కెట్ విలువ కలిగి, స్టాక్ మార్కెట్‌లో ఇంకా నమోదు కాని స్టార్టప్ సంస్థలను యూనికార్న్ అని అంటారన్న విషయం తెలిసిందే.
భారతీయులు అమెరికాలో అత్యధికంగా 95 యూనికార్న్‌లను స్థాపించారు. వీటిల్లో అధికశాతం బే ఏరియాలోనే ఉన్నాయి. అమెరికా తరువాత స్థానాల్లో బ్రిటన్ (4), సింగపూర్ (3), జర్మనీ (2) ఉన్నాయి. ఇక యూఎస్, చైనాకు ఆవల యూనికార్న్ కార్యకలాపాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో బెంగళూరు, పారిస్, బెర్లిన్ నగరాలు నిలిచాయి.
మరోవైపు, విజయపథంలో దూసుకుపోతున్న యూనికార్న్‌లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లలో టైగర్ గ్లోబల్, సాఫ్ట్‌బ్యాంక్ అండ్ హోంగ్‌షాన్ ముందువరుసలో నిలిచాయి. అయితే, ఈ ఏడాది స్టార్టప్‌లలోకి పెట్టుబడుల రాక కాస్తంత నెమ్మదించినట్టు నివేదికలో తేలింది. అమెరికా, భారత్, యూకేల్లో స్టాక్ మార్కెట్లో దూసుకుపోతున్నా యూనికార్న్‌ల ఐపీవోలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,453 స్టార్టప్‌లు యూనికార్న్ దశకు చేరుకున్నాయి. మొత్తం 58 దేశాల్లోని 291 నగరాల్లో యూనికార్న్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అమెరికాలో అత్యధికంగా 703 స్టార్టప్‌లు ఉండగా, చైనాలో 340 యూనికార్న్ స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థలకు యూనికార్న్‌లు చాలా కీలకమని ఈ నివేదిక పేర్కొంది. బైజూస్ లాంటి సంస్థలు విఫలమైనప్పటికీ కొత్త రంగాల్లో విలువ జోడింపునకు స్టార్టప్‌లు చాలా కీలకంగా మారాయని వ్యాఖ్యానించింది.