Ugadi: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థాన వేడుకలు
- నేడు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది
- తిరుమల ఆలయంలో బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం
- శ్రీవారి ఆలయ ముస్తాబు కోసం 10 టన్నుల పుష్పాల వినియోగం
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా వేడుకలు నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఆగమ శాస్త్ర పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థాన పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్నస్వామికి రూపాయి హారతి ఇచ్చారు.
ఉగాది పర్వదినం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందుకోసం 10 టన్నుల పుష్పాలను వినియోగించారు.
నేటి వేకువ జామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ జరిపారు. అనంతరం విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహించి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారి మూల విరాట్, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరింపజేశారు.