Solar Eclipse: అంతరిక్షం నుంచి గ్రహణం కనిపించిందిలా.. నాసా వీడియో ఇదిగో!

How Solar Eclipse Looks From Space NASA Shares Video

  • నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం
  • అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో తీసిన సైంటిస్టులు
  • ఆకాశంలో 4 నిమిషాల పాటు కనువిందు చేసిన ఖగోళ అద్భుతం

సంపూర్ణ సూర్యగ్రహణం.. సోమవారం అంతరిక్షంలో చోటుచేసుకున్న ఈ అద్భుతాన్ని నార్త్ అమెరికా వాసులతో పాటు మెక్సికో, కెనడా వాసులు ఆసక్తిగా వీక్షించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపించగా.. నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం 4.28 నిమిషాల పాటు కనువిందు చేసింది. గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ గా వ్యవహరించిన ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు అమెరికన్లు నార్త్ కు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి మెక్సికో తీర ప్రాంతాలకు చేరుకున్నారు. మరికొందరైతే ఆకాశంలో నుంచి గ్రహణాన్ని చూడాలని విమాన ప్రయాణం చేశారు. దీనికోసం పలు విమాన సంస్థలు ప్రత్యేకంగా విమానాలు కూడా నడిపాయి.

ఇక సూర్యగ్రహణాన్ని చూడలేని వారి కోసం నాసా లైవ్ పోగ్రాం నిర్వహించింది. అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని లైవ్ లో చూపించింది. గ్రహణ కాలంలో నార్త్ అమెరికాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చీకట్లు కమ్మేసిన దృశ్యాలను కెమెరాలో బంధించింది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా సైంటిస్టులు ఈ వీడియోను పంపించగా.. నాసా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నాసా యూట్యూబ్ ఛానల్ లోనూ లైవ్ ఏర్పాటు చేసింది. నార్త్ అమెరికాలోని మెక్సికో బీచ్ లకు అమెరికన్లు పోటెత్తారు.

ఒకటి రెండు రోజులు ముందుగానే మాజట్లాన్ సిటీకి చేరుకుని తీర ప్రాంతాలలో సందడి చేశారు. ఇలాంటి సూర్యగ్రహణం మళ్లీ 2044 లోనే అమెరికాలో కనిపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించాలంటే 2046 లోనే సాధ్యమని నాసా వెల్లడించడంతో జనాలలో ఆసక్తి పెరిగింది. నాసా ట్వీట్ చేసిన సూర్యగ్రహణం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News