Crime News: సిగరెట్లు తాగుతున్న మహిళల్ని తదేకంగా చూసిన యువకుడి దారుణ హత్య

Man killed for staring at 2 women smoking cigarettes at a shop In Nagpur

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • సిగరెట్ల కోసం పాన్‌షాప్‌కి వెళ్లిన యువకుడు
  • అక్కడ అప్పటికే సిగరెట్లు తాగుతున్న మహిళలు
  • వారిని తదేకంగా చూడడంతో గొడవ
  • స్నేహితులకు ఫోన్ చేసి యువకుడిని హత్యచేయించిన మహిళలు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు ఓ పాన్‌షాప్ వద్ద సిగరెట్ తాగుతుండగా చూసిన యువకుడు (26) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలు, హంతకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం.. రంజీత్ రాథోడ్ శనివారం రాత్రి నాగ్‌పూర్‌ మహాలక్ష్మినగర్‌లో ఓ పాన్‌షాపులో సిగరెట్లు కొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జేశ్రీ పండారే, సవిత సయారే సిగరెట్లు కాల్చుతూ కనిపించారు. దీంతో అతడు వారిని తదేకంగా చూశాడు. దీంతో వారు అతడిని కోపంగా చూశారు. అంతటితో ఆగక ఓ మహిళ రాథోడ్ ముఖంపై సిగరెట్ పొగ ఊదింది. దీంతో అతడు వీడియో తీయడం ప్రారంభించాడు. ఇది వారిమధ్య గొడవకు కారణమైంది. అది మరింత ముదరడంతో మహిళలు తమ స్నేహితులైన ఆకాశ్ రౌత్, జీతూ జాదవ్‌లకు ఫోన్ చేసి వెంటనే రావాలని కోరారు. 

వారు వెంటనే అక్కడికి చేరుకోగా, రాథోడ్ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నలుగురూ కలిసి రాథోడ్ కోసం వెతికి మహాలక్ష్మినగర్‌లో అడ్డుకుని దాడిచేశారు. ఈ క్రమంలో రాథోడ్‌ను రౌత్ కత్తితో పొట్టలో పొడవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలతోపాటు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

More Telugu News