Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. మామిడితోటను ట్యాపింగ్ కేంద్రంగా మార్చేసిన ప్రభాకర్‌రావు అండ్ కో!
- ఇద్దరు అధికారుల పేర్లు వెల్లడించిన రాధాకిషన్‌రావు
- తొలుత వారిని నిందితులుగా చేర్చి ఆపై అప్రూవర్లుగా మార్చే యోచనలో దర్యాప్తు అధికారులు
- వారిలో ఒకరు ప్రభాకర్‌రావుకు అత్యంత నమ్మకస్తుడు!
- ఎస్ఐబీ మాజీ చీఫ్ అరెస్ట్ అయితేనే సూత్రధారి పేరు బయటకు వస్తుందన్న అధికారులు
- ఖమ్మం జిల్లా పైనంపల్లిలోని మామిడితోటలోనూ ట్యాపింగ్ కేంద్రం
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు కీలక సాక్షులుగా ఉన్నారని, ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ)రాధాకిషన్‌రావు కూడా వారి పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. వారిద్దరినీ తొలుత నిందితులుగా చేర్చి ఆపై అప్రూవర్లుగా మార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. ఈ కేసులో వారిద్దరూ సాక్ష్యం చెప్పేందుకు సిద్ధపడిన తర్వాతే దర్యాప్తు అధికారులు టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించినట్టు తెలిసింది. అప్రూవర్లుగా మారబోతున్న ఇద్దరిలో ఒకరు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. నిజానికి ఈ కేసులో ప్రణీత్‌రావును విచారించడానికి ముందే ఆ ఇద్దరు ఓఎస్డీల ద్వారా పలు జిల్లాల్లోని వార్‌రూములు, ఏడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్యాపింగ్ కేంద్రాల సమాచారాన్నిసేకరించినట్టు తెలుస్తోంది.
సూత్రధారి ఎవరు?
ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారంతా ప్రభాకర్‌రావు చెప్పినట్టు చేశామని దర్యాప్తు అధికారులకు చెప్పారు. మరి ఆయన ఎవరి కోసం చేశారు? ట్యాంపింగ్ వ్యవహారానికి సూత్రధారి ఎవరు? ట్యాపింగ్‌కు అవసరమయ్యే పరికరాల కొనుగోలుకు నిధులు సమకూర్చింది ఎవరు? అన్న వివరాలు ప్రభాకర్‌రావు అరెస్ట్ తర్వాతే వెలుగులోకి వస్తాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ కేసు మరింత బలంగా మారాలంటే అప్రూవర్‌గా మారినవారు నేరం జరిగిన తీరును వివరించాల్సి ఉంటుంది. అప్పుడు దర్యాప్తు అధికారులు ఆధారాల కోసం పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి అప్రూవర్‌గా మారే వారిని తొలుత నిందితులుగా చేర్చి ఆపై కోర్టు అనుమతితో అప్రూవర్లుగా మార్చాల్సి ఉంటుంది. ఈ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
మామిడితోటలో ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రమంతటా విస్తరించింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి రెవెన్యూ పరిధిలోని ఓ మామిడితోటలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను అమర్చినట్టు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో బీఆర్ఎస్ అసంతృప్తులైన ప్రస్తుత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు మరికొందరిని టార్గెట్‌గా చేసుకుని అక్కడ ట్యాపింగ్ పరికరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్ఐబీకి చెందిన ఓ బృందం నిన్న మామిడితోటకు చేరుకుని తోట పరిసరాల్లోని వారిని ప్రశ్నించినట్టు తెలిసింది.