Tillu Square: హైదరాబాదులో గ్రాండ్ గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్.... హాజరైన ఎన్టీఆర్, త్రివిక్రమ్

Jr NTR and Trivikram attends Tillu Square success meet

  • సిద్ధు, అనుపమ జంటగా టిల్లు స్క్వేర్
  • ఇటీవల విడుదల... తొలి ఆట నుంచే హిట్ టాక్
  • వంద కోట్ల క్లబ్ లో చేరిన వైనం 

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో వచ్చిన డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మార్చి 29న రిలీజైంది. మొదటి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ ఈజీగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. 

ఈ నేపథ్యంలో, నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో విష్వక్సేన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 

ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... సినిమా అంటే విపరీతమైన వ్యామోహం ఉండే సిద్ధు వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని కొనియాడారు. మనందరికీ టామ్ అండ్ జెర్రీ, హీమ్యాన్ క్యారెక్టర్లు తెలుసని, ఇప్పుడు వాటి కోవలోనే డీజే టిల్లు క్యారెక్టర్ కూడా చేరుతుందని పేర్కొన్నారు. మనలో ఒకడిగా ఉండడమే డీజే టిల్లు క్యారెక్టర్ స్పెషాలిటీ అని, అందుకే ఆ పాత్రకు అంత గుర్తింపు వచ్చిందని ఎన్టీఆర్ విశ్లేషించారు. 

అదుర్స్, అరవింద సమేత చిత్రాల్లో కామెడీ సీన్ల చిత్రీకరణ సమయంలో తాను ఎంతగానో నవ్వానని, మళ్లీ ఇన్నాళ్లకు టిల్లు స్క్వేర్ చూశాక ఆ స్థాయిలో నవ్వానని వివరించారు. సిద్ధు, విష్వక్సేన్ టాలీవుడ్ భవిష్యత్ తారలు అని తాను ఎప్పటినుంచో భావిస్తున్నానని, వారు ఆ దిశగా అడుగులు వేయాలని ఎన్టీఆర్ సూచించారు. 

దేవర ఆలస్యంగా వస్తుందేమో... కానీ...!

టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ తన దేవర చిత్రంపై అప్ డేట్ ఇచ్చారు. దేవర సినిమా విడుదల ఆలస్యం కావొచ్చేమో కానీ... ప్రతి అభిమాని కాలర్ ఎగరేసేలా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ మేరకు కచ్చితమైన హామీ ఇస్తున్నానని వేదిక పైనుంచి ప్రకటించారు.

More Telugu News