Lizaad Williams: బామ్మ మరణంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న హ్యారీ బ్రూక్.. సౌతాఫ్రికా స్టార్ పేసర్‌ను తీసుకున్న డీసీ

Delhi Capitals Replaced Harry Brook With SA Pacer Lizaad Williams

  • లిజాద్ విలియమ్స్‌తో రూ. 50 లక్షలతో డీసీ ఒప్పందం
  • ఢిల్లీ జట్టు నుంచి తప్పుకున్న బ్రూక్ 
  • సోషల్ మీడియా ద్వారా వివరణ
  • గత సీజన్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం 

బామ్మ మరణంతో ఐపీఎల్‌కు దూరమైన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లిజాద్ విలియమ్స్‌తో ఢిల్లీ కేపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 30 ఏళ్ల విలియమ్స్ సౌతాఫ్రికా తరపున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు, 11 టీ20లు ఆడాడు. తాజాగా, డీసీ యాజమాన్యం అతడితో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని జట్టులోకి తీసుకుంది.

బ్రూక్‌ను ఢిల్లీ యాజమాన్యం రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. ఫిబ్రవరిలో అతడి బామ్మ కన్నుమూయడంతో ఐపీఎల్ నుంచి విరమించుకున్నాడు. జట్టు నుంచి వైదొలగడంపై తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బ్రూక్ స్పందించాడు. ఢిల్లీ కేపిటల్స్ తనను తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, జట్టుతో చేరాలని ఆసక్తి ఎదురుచూశానని పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టు నుంచి తప్పుకోవాలన్న నిర్ణయంపై వ్యక్తిగత కారణాలను పంచుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నానని, అయితే, ఎందుకు అని చాలామంది అడగడంతో చెప్పక తప్పడం లేదని పేర్కొన్నాడు. గత నెలలో తన బామ్మ చనిపోయిందని, ఆమె అంటే తనకు చాలా అభిమానమని, చిన్నప్పుడు చాలాకాలం ఆమె ఇంటిలోనే పెరిగానని గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ పట్ల తనకున్న దృక్పథం, క్రికెట్ పట్ల ప్రేమ తన దివంగత తాత నుంచే అలవడిందని పేర్కొన్నాడు. 

గత సీజన్‌లోనే ఐపీఎల్‌లో ఆడిన బ్రూక్ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లోనే సెంచరీ బాది తానేంట్లో నిరూపించాడు. మొత్తం 11 మ్యాచుల్లో 190 పరుగులు చేశాడు. హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడిని రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.

More Telugu News