Hyderabad Murder: స్నేహితుడి హత్యకు ప్రతీకారం.. హైదరాబాద్ లో దారుణ హత్య
- సెల్ఫీ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన యువకులు
- ప్రగతినగర్ బతుకమ్మ ఘాట్ వద్ద కత్తులతో దాడి
- బైక్ లపై వచ్చిన ఇరవై మంది యువకులు
- ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసిన పోలీసులు
గతేడాది జరిగిన స్నేహితుడి హత్యకు ప్రతీకారంగా ఇరవై మంది కలిసి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆపై సెల్ఫీ వీడియోలతో ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేశారు. మృతదేహం పక్కనే డ్యాన్సులు చేస్తూ, రక్తంతో తడిసిన కత్తిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుందీ దారుణం. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సార్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ అనే యువకుడు గతేడాది బోరబండలో జరిగిన ఓ హత్యలో నిందితుడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన తేజస్ రెండు నెలల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎస్సార్ నగర్ నుంచి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్ కు మారాడు. అక్కడ ఓ అద్దె ఇంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఊరు వెళ్లగా.. తేజస్ ఒక్కడే ఉన్నాడు. తన స్నేహితులు మహేశ్, శివప్ప, సమీర్ తో కలిసి రాత్రి మద్యం సేవించాడు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బతుకమ్మ కుంట దగ్గర ఒంటరిగా ఉన్న తేజస్ పై దాదాపు 20 మంది యువకులు ఒక్కసారిగా దాడి చేశారు.
బైక్ లపై వచ్చిన ఆ యువకులు కత్తులతో పొడవడంతో తేజస్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దారుణాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన యువకులు.. దానిని ఇన్ స్టాలో రీల్స్ చేసి పోస్ట్ చేశారు. తమ స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని అందులో చెప్పారు. తరుణ్ హత్యలో మరో నిందితుడు షరీఫ్ కు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ దారుణం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.