PURANAPANDA SRINIVAS: బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఉచితంగా ‘సౌభాగ్య’ మంత్ర గ్రంథం

Vijayawada Kanakadurga Temple Devotees Will Get Soubhagya Book Free

  • సౌభాగ్య మంత్ర గ్రంథాన్ని రచించిన పురాణపండ శ్రీనివాస్
  • ఇందులో 25 శక్తిమంతమైన ఉపాసన విశేషాలు
  • కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య చొరవతో రూపుదిద్దుకున్న పుస్తకం
  • ఉగాదినాడు దుర్గమ్మ సమక్షంలో ఆవిష్కరించనున్న ఆలయ ఈవో కేఎస్ రామారావు

బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఇది శుభవార్తే. శ్రీశైల దేవస్థానం మాజీ ప్రత్యేక సలహాదారు, జ్ఞాన మహాకేంద్ర సంస్థాపకుడు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన పాకెట్ సైజ్ ‘సౌభాగ్య’ మంత్ర గ్రంథాన్ని అమ్మవారి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) కేఎస్ రామారావు తెలిపారు. ఈ మంగళ గ్రంథంలో 25 శక్తిమంతమైన ఉపాసన విశేషాలున్నాయి. పూర్తి మల్టీకలర్ చిత్రాలతో, ఇండియన్ ఆర్ట్ పేపర్‌తో ఉత్తమ విలువల గ్రంథంగా శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని రూపొందించారని రామారావు కొనియాడారు.  ప్రతి చైత్రమాసంలో అమ్మవారికి ఆయన ఏదో ఒక అద్భుతాన్ని భక్తులకు అందిస్తుంటారని ప్రశంసించారు. 

సౌభాగ్య అనే చక్కని ఉపాసనా విలువల గ్రంథాన్ని అమ్మవారి భక్తులకు ఉచితంగా అందించాలన్న తలంపుతో మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య.. పురాణపండ శ్రీనివాస్ ద్వారా తన కోరికను నెరవేర్చుకున్నారు. అన్నదానం పథకానికి విరాళమిచ్చే దాతలు, దుర్గమ్మ కుంకుమార్చలనలో పాల్గొనే భక్తులు, దేవస్థానం అధికారిక మాసపత్రిక ‘కనకదుర్గ ప్రభ’ నూతన చందాదారులకు, లడ్డు కొనుగోలుదారులకు, ప్రత్యేక దర్శనాల టికెట్ కొనుగోలు చేసేవారికి ఈ సౌభాగ్య గ్రంథాన్ని ఉచితంగా అందించనున్నట్టు కేఎస్ రామారావు తెలిపారు.

ఏపీలో తొలిసారి ఈ ‘మంత్ర ప్రసాదాన్ని’ భక్తులకు సమర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ అద్భుత కార్యాన్ని సమర్పించిన బొల్లినేని కృష్ణయ్య, గ్రంథాన్ని రూపొందించిన పురాణపండ శ్రీనివాస్‌కు దుర్గమ్మ అనుగ్రహం సిద్ధిస్తుందని ఆకాంక్షించారు. 132 పేజీలున్న ఈ గ్రంథాన్ని ఉగాదినాడు దుర్గమ్మ సమక్షంలో ఈవో ఆవిష్కరించి, భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

More Telugu News