Chandrababu: మేం ఇవ్వబోయే పెన్షన్లు ఈ నెల నుంచే ప్రారంభం అయినట్టు భావించండి: చంద్రబాబు

Chandrababu assures pensions will be applicable from April

  • కృష్ణా జిల్లా పామర్రులో చంద్రబాబు ప్రజాగళం సభ
  • జూన్ లో అధికారంలోకి వస్తామన్న చంద్రబాబు
  • రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, ఈ నెల నుంచే వర్తింపజేస్తామని వెల్లడి
  • జులైలో బకాయిలతో కలిపి పెన్షన్లు ఇస్తామని హామీ

టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పామర్రులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ 27 పథకాలు రద్దు చేసి సంక్షేమం అంటున్నారు... రోడ్ల మీద గుంతలు పూడ్చలేరు కానీ, 3 రాజధానులు కడతారంట... మేం అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. మేం ఇవ్వబోయే పెన్షన్లు ఈ నెల నుంచే ప్రారంభం అయినట్టు భావించండి. మేం జూన్ లో అధికారంలోకి వస్తే... జులైలో మూడు నెలల బకాయిలతో కలిపి పెన్షన్ అందిస్తాం... పెన్షన్ల విషయంలో శవరాజకీయాలు చేసిన వ్యక్తులు ఈ వైసీపీ నేతలు... అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఈ గడ్డకు ఓ మహత్యం ఉందని, సాహితీ, సాంస్కృతిక, సినీ, రాజకీయ ప్రముఖులు ఇక్కడే పుట్టారని చంద్రబాబు వివరించారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఈ గడ్డపైనే పుట్టారు.... పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం కోసం ఎన్టీఆర్ కృషి చేశారని వివరించారు. త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టారు, మహా గాయకుడు ఘంటసాల ఈ గడ్డపైనే పుట్టారు, మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ గడ్డపైనే పుట్టారు, వేటూరి సుందరరామ్మూర్తి ఈ గడ్డపైనే పుట్టారు, నార్ల వెంకటేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే పుట్టారు... జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడే పుట్టారని వివరించారు. 

అలాంటి తులసిమొక్కలు పుట్టిన గడ్డపై ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారం అంటే బూతులు... ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి... ఎవడు దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 

"ఈ పామర్రు నుంచి ప్రమాణం చేస్తున్నా... పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నది నా ఆశయం. అదే ఎన్టీఆర్ గారి సందేశం. మీ ఆశీస్సులతో అది సాధిస్తా. హైదరాబాద్ కు ఒక అవుటర్ రింగ్ రోడ్డు, ఒక నాలెడ్జ్ ఎకానమీ, ఒక ఐటీ... ఇవన్నీ తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కనీసం ఒక చిన్న పాచి పని కోసం, మట్టి పని కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటి ఈ ఖర్మ? ఎవరు కారణం? 

అదే ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే హైదరాబాద్ కు దీటుగా దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతి ఏర్పడేది. అమరావతి అభివృద్ధి చెంది ఉంటే 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు... ఆ ఆస్తి ప్రజలకే చెందేది. లక్షల కోట్ల ఆదాయ వనరులు మనకు సమకూరేవి. ఆ డబ్బుతో పెన్షన్లు ఇచ్చేవాళ్లం, మనకు ఏం కావాలో వాటికి ఆ నిధులు ఉపయోగించుకుని, మన బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుకునేవాళ్లం. అమరావతి రాజధానిగా ఉండుంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేది. ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు వచ్చి తీరని ద్రోహం చేశాడు. 

ప్రతిసారి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటాడు... మేం తీసుకువచ్చిన అనేక పథకాలు రద్దు చేశాడు. ఎంత అహంకారి అంటే... ఎస్సీలకు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరుపెడితే, అంబేద్కర్ పేరు తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నాడు. జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ కంటే గొప్పవాడా? ఒక్క ఎస్సీ విద్యార్థికైనా విదేశీ విద్య పథకం అందించాడా? జగన్ ఒక దళిత ద్రోహి. మళ్లీ దళితులను ఆదుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే. 

జగన్ కు డబ్బులు కావాలి... నాకు మంచి నేతలు కావాలి. ఈ జిల్లాలో దేవినేని ఉమ వంటి మంచి నేతలు ఉన్నారు. టికెట్ రాకపోయినా పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. ఎప్పుడూ టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఏ విధంగానైనా న్యాయం చేస్తాం. వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీలోని నేతలు టీడీపీలోకి వస్తున్నారు" అని చంద్రబాబు వివరించారు.


  • Loading...

More Telugu News