Anurag Thakur: అప్పటివరకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదు.. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు!
![Until Pakistan says no to terrorism India should not go to play cricket there says Anurag Thakur](https://imgd.ap7am.com/thumbnail/cr-20240406tn6610d012b21ec.jpg)
- వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
- పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయిస్తుందన్న అనురాగ్ ఠాకూర్
- భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ముందు ఆ పని ఆపాలన్న మంత్రి
- అప్పుడే భారత జట్టు అక్కడికి క్రికెట్ ఆడటానికి వెళ్తుందని వెల్లడి
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు ఆ దేశానికి వెళ్లే అంశంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెళ్లాలా వద్దా అనేది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసీసీఐ) నిర్ణయిస్తుందని ఠాకూర్ చెప్పారు. అయితే క్రికెట్, ఉగ్రవాదం ఒకదానితో ఒకటి కలిసి వెళ్లలేవని అన్నారు. పొరుగు దేశాలు ఉగ్రవాద కుట్రలను ఆపే వరకు పాకిస్థాన్ పర్యటనకు భారత్ వెళ్లకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'న్యూస్24'తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'న్యూస్24'తో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. "పాక్‌కు భారత జట్టును పంపించాలా వద్దా అనేది బీసీసీఐ తేల్చాల్సిన విషయం. కానీ, నేను బీసీసీఐలో ఉన్నప్పుడు రెండు విషయాలు (ఉగ్రవాదం, క్రికెట్) చేయి చేయి కలిపి నడవలేవని చెప్పాను. భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తారు.. బుల్లెట్లు కాల్చుతారు.. బాంబులు వేయడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో క్రికెట్ ఆడటం గురించి మాట్లాడుతారు. ఈ రెండూ కలిసి కొనసాగడం అసాధ్యం. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ముందు ఆ పని ఆపాలి. అప్పుడే మన జట్టు అక్కడికి వెళ్తుంది. అప్పుడు పాక్ స్టేడియాలు వెలిగిపోతాయి. ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నంత కాలం భారత జట్టు క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లకూడదని నేను బీసీసీఐలో ఉన్నప్పుడే చెప్పాను. బోర్డు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది" అని ఆయన 'న్యూస్24'తో అన్నారు.
కాగా, భారత్ చివరిసారిగా 2006లో క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టీమిండియాను తమ దేశానికి వచ్చేలా ఒప్పించేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.