Janajatara Sabha: నేడు కాంగ్రెస్ పార్టీ ‘జనజాతర’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restriction in hyderabad ahead of Janajatara sabha in Tukkuguda in Telangana

  • తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ‘జనజాతర’ బహిరంగ సభ
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
  • వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్ జోషి కీలక సూచనలు

కాంగ్రెస్ పార్టీ నేడు తుక్కుగూడలో 'జనజాతర' బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సభలో పాల్గొనే వారికి, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి శుక్రవారం వాహనదారులకు పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. 

ఖమ్మం, నల్గొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనదారులు పెద్ద అంబర్‌పేట్ ఓఆర్ఆర్ లేదా సర్వీసురోడ్డు నుంచి బొంగుళూరు టోల్‌కు వెళ్లే మార్గంలో రావిర్యాల టోల్ వద్ద ఎడమవైపు తిరిగి ఫ్యాబ్‌ సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి. మాల్, ఇబ్రహీపట్నం, నాగార్జున సాగర్ హైవే, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ బొంగుళూరు టోల్ నుంచి రావిర్యాల టోల్ వద్ద నుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. 

జాతీయ రహదారి 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్ పీఎం మీటింగ్ స్థలం వద్ద పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోవాలి. జహీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు పటాన్‌చెరు నుంచి గచ్చిబౌలీ, శంషాబాద్ మీదుగా పెద్ద గోల్కొండ వద్ద కిందకు దిగి ఓల్డ్ పీఎం మీటింగ్ స్థలం వద్ద పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఘట్కేసర్ ఓఆర్ఆర్ మీదుగా రావిర్యాల వద్ద కిందకు దిగి ఫ్యాబ్‌సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపాలి. సిద్ధిపేట నుంచి వచ్చే వాహనాలు శామీర్‌పేట మీదుగా రావిర్యాల చేరుకొని ఫ్యాబ్ సిటీ వద్ద పార్కింగ్ కు చేరుకోవాలి. 

శ్రీశైలం వైపునకు వెళ్లే సాధారణ వాహనాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడమవైపు తిరిగి ఆగాఖాన్ అకాడమీ, విజయాడెయిరీ, గాంధీ బొమ్మ, రావిర్యాల, వండర్‌లా జంక్షన్, తిమ్మాపూర్, రాచులూరు నుంచి రాచులూరు గేటు మీదుగా వెళ్లాలి. శ్రీశైలం రహదారి నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వారు మహేశ్వరం గేటు వద్ద ఎడమవైపు తిరిగి మన్‌సాన్‌పల్లె, నాగారం, పెద్ద గోల్కొండ మీదుగా శంషాబాద్‌కు చేరుకోవాలి. సభ నేపథ్యంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలను కిందకు దిగడానికి అనుమతించరు. పెద్దఅంబర్‌పేట్ నుంచి పెద్దగోల్కొండ దారిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సాధారణ వాహనాలకు అనుమతి లేదు.

More Telugu News