Chandrababu: సూపర్-6 పథకాలను మరోసారి వివరించిన చంద్రబాబు

Chandrababu reiterates Super Six schemes

  • తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం
  • కొవ్వూరులో భారీ సభ 
  • మేనిఫెస్టోలోని ప్రధాన పథకాలను ప్రజలకు వివరించి చెప్పిన చంద్రబాబు

కొవ్వూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్-6 పథకాలను వివరించారు. సూపర్-6లో మొదటిది ఆడబిడ్డ నిధి అని వెల్లడించారు. నెలకు రూ.1500 ఇస్తామని, ఇద్దరు మహిళలు ఇంట్లో ఉంటే రూ.3 వేలు, ముగ్గురు ఉంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6,000 ఇస్తామని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. నేరుగా మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాం అని మహిళలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ డబ్బుతో మరింత డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పిస్తానని తెలిపారు. 

రెండోది... తల్లికి వందనం. ఈ బిడ్డలే మన ఆస్తి అని పేర్కొన్నారు. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరు బిడ్డలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు బిడ్డలు ఉంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం అని వెల్లడించారు. ఎందుకంటే, జనాభా తగ్గిపోతోందని, జనాభా తగ్గిపోతే రాజ్యం ఉండదని అన్నారు. ఈ పిల్లలను బాగా చదివిస్తే వీళ్లు ప్రపంచాన్ని శాసిస్తారని, అందుకే తల్లికి వందనం పథకం రూపొందించామని చంద్రబాబు చెప్పారు. మూడోది... మేం అధికారంలోకి రాగానే మా ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని వెల్లడించారు. 

నాలుగోది... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, చంద్రన్నే మీ డ్రైవర్ అని, నా డ్రైవింగ్ చాలా సేఫ్ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా అడ్డొస్తే చెప్పండి... ఎవరూ మిమ్మల్ని అడగడానికి వీల్లేదు... మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అనడానికి కూడా లేదు అని  స్పష్టం చేశారు. 

ఇక ఐదోది... యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. వర్క్ ఫ్రం హోమ్ విధానం తీసుకువస్తాం... ప్రపంచస్థాయి కంపెనీలను అందుకు అంగీకరింపజేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ఆరో పథకం... రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం... రైతులకు సబ్సీడీలు ఇస్తాం, పంట బీమా అందిస్తాం, పంటను కొంటాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Chandrababu
Super-6
Kovvur
Praja Galam
TDP
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News