Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఆ సీసీ కెమెరాల ఏర్పాటు రాధాకిషన్‌రావు అండ్ కో పనేనట!
- బీఆర్ఎస్ నేతలు గువ్వల బాలరాజు, రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్‌రావు
- వారి సంభాషణను బట్టి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకి
- వారు సమావేశమైన గదిలో సీసీ కెమెరాలు అమర్చిన రాధాకిషన్‌రావు బృందం
- నోటీసులు ఇచ్చేందకు ప్రత్యేక విమానంలో సిట్ వెళ్లడంపైనా దర్యాప్తు
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో అదిరిపడే విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధం ఉన్న విషయం తాజాగా బయటపడింది. బీఆర్ఎస్ నేతలు గువ్వల బాలరాజు, రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఫోన్లను ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ట్యాప్ చేయడంతోనే ఈ వ్యవహారం వెలుగుచూసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల సంభాషణలతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్‌రావు, ఆయన బృందం చర్చలు జరిగిన గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం కూడా బయటకు వచ్చింది. అప్పటి సిట్ బృందం నోటీసులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతకు చెందిన ప్రత్యేక విమానంలో వచ్చిన విషయం కూడా బయటకు వచ్చి సంచలనమైంది. అదే విమానంలో బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారని, ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందన్న దానిపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు.