Byjus Raveendran: ఏడాది కిందట 17 వేల కోట్ల ఆస్తి .. ఇప్పుడు సున్నా.. బైజూస్ ఓనర్ దుస్థితి..!
- కిందటేడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న రవీంద్రన్
- ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తో వేగంగా పైకెదిగిన వైనం
- ఒడిదుడుకులతో అంతే వేగంగా నేలకు జారిన బైజూస్ అధినేత
- దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ గా ప్రశంసలు
గతేడాది ఇదే సమయానికి ఆయన వేల కోట్లకు అధిపతి.. రూ.17 వేల కోట్ల నెట్ వర్త్ తో ప్రపంచ కుబేరుల జాబితా ఫోర్బ్స్ లో స్థానం సంపాదించాడు.. ఆయన కంపెనీ దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ గా బిజినెస్ ప్రపంచంలో అందరితో ప్రశంసలు అందుకుంది. ఒక్క ఏడాదిలో అంతా తారుమారైంది. వేల కోట్ల అధిపతి నుంచి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితికి చేరాడు. గతేడాది దాకా లగ్జరీ జీవితం అనుభవించిన పరిస్థితి నుంచి ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు ముచ్చటపడి కొనుక్కున్న ఇంటిని తాకట్టు పెట్టాల్సిన స్థితికి చేరాడు. ఆయనే.. బైజూస్ అధినేత రవీంద్రన్.. 2011 లో రవీంద్రన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ ను స్థాపించాడు. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ల దాకా ఆన్ లైన్ లో పాఠాలు బోధించే ఈ స్టార్టప్ కు కరోనా కాలంలో దశ తిరిగింది. అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఆదరణ లభించగా.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో బైజూస్ వాల్యూ అమాంతంగా పైకిలేచింది.
2022లో ఆయన సంపద ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరడంతో రవీంద్రన్ పేరును ఫోర్బ్స్ జాబితాలోకి చేర్చింది. అయితే, కంపెనీ అనుసరించిన పలు విధానాలు, సీఈవోగా రవీంద్రన్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి. దీంతో రాకెట్ వేగంతో పైకెదిగిన బైజూస్.. అదే వేగంతో చతికిలపడింది. ఈ ఏడాదికి సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అందులో బైజూస్ అధినేత రవీంద్రన్ తో పాటు మరో ముగ్గురు చోటు కోల్పోయారని పేర్కొంది. 2022 లో 22 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో ఉన్న బైజూస్ సీఈవో.. ఈ ఏడాది 1 బిలియన్ కన్నా తక్కువకు పడిపోయిందని ఫోర్బ్స్ తన రిపోర్టులో వెల్లడించింది.