Kiran Kumar Reddy: మిథున్ రెడ్డి రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు: కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy fires on Mithun Reddy

  • మదనపల్లెలో కూటమి నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం
  • ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని వ్యాఖ్య
  • మదనపల్లి జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. రాజంపేట లోక్ సభ స్థానం నుంచి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మదనపల్లెలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. సీఏఏ చట్టం భారతీయులకు వర్తించదని... మన దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. 

బాబ్రీ మసీదు స్థల వివాదంలో హిందూ దేవాలయం కోసం 2.74 ఎకరాల స్థలాన్ని ఇస్తే... ముస్లింల మసీదు కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని అన్నారు. 6 ముస్లిం దేశాలు ప్రధాని మోదీకి అవార్డులు ఇచ్చాయని చెప్పారు. పదేళ్లు రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి లిక్కర్, ఇసుకతో రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

More Telugu News