Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యానికేమీ ఢోకా లేదన్న తీహార్ జైలు అధికారులు

Tihar jail sources says no worries about Kejriwal health

  • లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
  • ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న ఆప్ అధినేత
  • కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయాయంటూ ఆప్ నేతల ఆందోళన
  • కేజ్రీవాల్ ను ఇద్దరు డాక్టర్లు పరిశీలించారన్న తీహార్ జైలు వర్గాలు

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని, ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. దీనిపై తీహార్ జైలు వర్గాలు స్పందించాయి. కేజ్రీవాల్ ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, ఆయన కీలక ఆరోగ్య వ్యవస్థలన్నీ భేషుగ్గా ఉన్నాయని జైలు అధికారులు వెల్లడించారు. 

కేజ్రీవాల్ ను తాజాగా ఇద్దరు వైద్యులు పరిశీలించారని... రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు, కీలక అవయవాల పనితీరు అంతా బాగుందని వారు తెలిపారని వివరించారు. అంతేకాదు, జైలుకు వచ్చేనాటికి కేజ్రీవాల్ 65 కిలోల బరువు ఉన్నారని, ఇప్పుడు కూడా అంతే బరువు ఉన్నారని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్నే అందిస్తున్నామని పేర్కొన్నారు. 

అయితే, ఆప్ మంత్రి అతీశి జైలు వర్గాల ప్రకటనను ఖండించారు. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన 69.5 కిలోల బరువు ఉన్నారని, ఇప్పుడు ఆయన బరువు 65 కిలోలకు తగ్గిపోయిందని అన్నారు. 

కేజ్రీవాల్ తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారని, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ 24 గంటలూ దేశ సేవ, ప్రజా సేవకే అంకితమయ్యారని అతీశి పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి బరువు తగ్గిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ ను జైల్లో ఉంచడం ద్వారా, బీజేపీ ఆయన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని మండిపడ్డారు.

More Telugu News