Btech Ravi: వివేకా హత్యపై నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది: బీటెక్ రవి

BTech Ravi supports Sharmila claims

  • తాను కడప ఎంపీగా పోటీ చేయాలన్నది చిన్నాన్న కోరిక అని షర్మిల వెల్లడి
  • షర్మిల పోటీ చేస్తుందన్న విషయాన్ని వివేకానే జగన్ కు చెప్పారన్న బీటెక్ రవి
  • ఆ తర్వాత ఏం జరిగిందో కానీ వివేకా హత్యకు గురయ్యారని వ్యాఖ్యలు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తూ వివేకా హత్యోదంతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న వివేకా హంతకులను వెంటేసుకుని తిరుగుతున్నారని, అవినాశ్ వంటి వ్యక్తులను మళ్లీ చట్టసభలోకి అడుగుపెట్టనివ్వకూడదని అన్నారు. అవినాశ్ ను ఓడించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనను కడప ఎంపీగా పోటీ చేయించాలని చిన్నాన్న భావించారని షర్మిల నిన్న వెల్లడించారు. 

షర్మిల వ్యాఖ్యలపై పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి స్పందించారు. వివేకా హత్యపై నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెలిపారు. వివేకా హత్యపై సజ్జలతో పాటు సాక్షి దినపత్రిక పలు ఆరోపణలు చేసిందని, వివేకాను చంపడం వెనుక కారణం ఏంటి, ఎవరికి లాభం? అంటూ సజ్జల వ్యాఖ్యానించారని వివరించారు. వివేకా హత్య గురించి షర్మిల కుండబద్దలు కొట్టారని వివరించారు. 

"కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుందని జగన్ కు వివేకా చెప్పారు...   ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో కానీ వివేకా హతులయ్యారు" అని బీటెక్ రవి వివరించారు. కడప బరిలో పోటీకి షర్మిల ఒప్పుకున్నాక వివేకా హత్యకు కుట్ర జరిగింది అని ఆరోపించారు. 

అవినాశ్ రెడ్డికి సిగ్గుంటే ఎంపీ బరి నుంచి తప్పుకోవాలని అన్నారు. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీకి పెట్టారని విమర్శించారు. వైసీపీ రక్తపు మరకల మధ్య పుట్టిన పార్టీ... వివేకా హంతకులు జగన్ చుట్టే తిరుగుతున్నారని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.

Btech Ravi
Sharmila
YS Vivekananda Reddy
Jagan
Kadapa
  • Loading...

More Telugu News