apple: యాపిల్ ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్ యూజర్లకు భారత ప్రభుత్వం సెక్యూరిటీ వార్నింగ్

Government issues high security warning for Apple iPhone MacBook and iPad users

  • సాఫ్ట్ వేర్ లో లోపాన్ని గుర్తించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం 
  • దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొరబడే ప్రమాదం
  • వెంటనే సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచన

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్ ఇన్) తాజాగా భారత్ లోని యాపిల్ ఉత్పత్తుల యూజర్లకు భారీ సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ డివైస్లలో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబులిటీ’ని గుర్తించామని.. ఇది యూజర్ల డివైస్లు హ్యాకర్ల బారిన పడేందుకు దారితీయొచ్చని హెచ్చరించింది. దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొరబడి నిర్దేశిత లక్ష్యంపై ‘ఆర్బిట్రరీ కోడ్’ను అమలు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. సాఫ్ట్ వేర్ లోని భద్రతా లోపం యాపిల్ డివైస్ ల యూజర్లను హ్యాకర్లు ఓ ప్రత్యేక లింక్ లోకి వెళ్లేలా బురిడీ కొట్టించవచ్చని.. తద్వారా రిమోట్ పద్ధతిలో డివైస్ పై దాడి చేసేందుకు అవకాశం హ్యాకర్లకు లభించొచ్చని సెర్ట్ ఇన్ తెలిపింది.

ఈ వెర్షన్లతో కూడిన యాపిల్ డివైస్లకే అధిక ముప్పు
1. సెర్ట్ ఇన్ హెచ్చరికల ప్రకారం 17.4.1 కన్నా ముందు వెర్షన్ గల ఐవోఎస్ , ఐప్యాడ్ ఓఎస్ ల పై పనిచేసే యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్ డివైస్ లు హ్యాకింగ్ కు గురికావొచ్చు.
2. ఐఫోన్ 10ఎస్ తర్వాత వచ్చిన అన్ని ఐఫోన్లు, ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచ్ సెకండ్ జనరేషన్ ఆపై వెర్షన్లు, ఐప్యాడ్ ప్రో 10.5 ఇంచ్, ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ ఫస్ట్ జనరేషన్ ఆపైన వెర్షన్లవి, ఐప్యాడ్ ఎయిర్ జెన్ 3 ఆ తర్వాత వెర్షన్లు, ఐప్యాడ్ జెన్ 6 ఆపై వెర్షన్లు, జెన్ 5 తర్వాత వచ్చిన ఐప్యాడ్ మినీ వెర్షన్లు. 
3. అలాగే 16.7.7 అప్ డేట్ కు ముందు వచ్చిన ఐవోఎస్ , ఐప్యాడ్ వెర్షన్లు సైతం హ్యాకింగ్ ముప్పు ఎదుర్కోవచ్చని సెర్ట్ ఇన్ తెలిపింది.
4. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 10, ఐప్యాడ్ జెన్ 5, ఐప్యాడ్ ప్రో 9.7 ఇంచ్, ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచ్ జెన్ 1లో ఈ వెర్షన్ ఉందని వివరించింది. 5. వీటితోపాటు 17.4.1 కన్నా ముందు వచ్చిన యాపిల్ సఫారీ వెర్షన్స్ (అంటే మ్యాక్ ఓఎస్ మాంట్రే, మ్యాక్ ఓఎస్ వెంట్యూరాలలో) కూడా ముప్పు బారిన పడే అవకాశం ఉందని సెర్ట్ ఇన్ తెలిపింది.
6. అలాగే మ్యాక్ బుక్ యూజర్లు (13.6.6 కన్నా ముందు వచ్చిన మ్యాక్ ఓఎస్ వెంట్యూర్ వెర్షన్లు), మ్యాక్ ఓఎస్ సోనోమా వెర్షన్లు (14.4.1 కన్నా ముందువి) కూడా ముప్పు ఎదుర్కోవచ్చని పేర్కొంది.
7. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లతోపాటు విజన్ ప్రో హెడ్ సెట్ యూజర్లు (1.1.1 కన్నా ముందు వెర్షన్లు) కూడా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


యాపిల్ డివైస్ లను కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

మీ యాపిల్ డివైస్ లన్నీ భద్రంగా ఉండాలంటే ఈ చర్యలు వెంటనే తీసుకోండి.
1. ముందుగా ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా ఉండేందుకు యాపిల్ ఐఓఎస్ , ఐప్యాడ్ వోఓఎస్ డివైస్ల సాఫ్ట్ వేర్ ను తాజా వెర్షన్లకు అప్ డేట్ చేసుకోండి.
2. యాపిల్ అందించే సెక్యూరిటీ ప్యాచెస్ ను డివైస్ లకు వర్తింపజేయండి.
3. డివైస్ లను నెట్ వర్క్ లకు కనెక్ట్ చేసేటప్పుడు భద్రమైన కనెక్షన్లనే ఎంచుకోండి.
4. పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లు లేదా భద్రంకాదని భావించే నెట్ వర్క్ లను ఎంచుకోకండి. దీనివల్ల హ్యాకింగ్ ముప్పు వీలైనంత తగ్గించొచ్చు.
5. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను అదనపు భద్రతా ఫీచర్ కింద ఎనేబుల్ చేసుకోండి.
6. యాప్స్ లేదా సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకొనేటప్పుడు యాపిల్ యాప్ స్టోర్ వంటి సురక్షితమైన సోర్స్ లనే ఎంపిక చేసుకోండి.
7. డేటా నష్టాన్ని లేదా భద్రతా లోపాలను లేదా సిస్టమ్ ఫెయిల్యూర్లను నివారించేందుకు తరచూ మీ డేటాను భద్రపరుచుకోండి.
8. సెర్ట్ ఇన్ లేదా యాపిల్ వంటి నమ్మదగిన సంస్థలు అందించే సెక్యూరిటీ అలర్ట్ ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి.

More Telugu News