Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్!
- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- ఆరు నెలలుగా జైల్లో ఉన్న ఆప్ నేత
- లిక్కర్ స్కాం తాలూకు ఒక్క పైసా కూడా ఆప్ ఎంపీ వద్ద దొరకనప్పుడు ఆయనను ఎందుకు జైల్లో పెట్టారని ఈడీకి కోర్టు మొట్టికాయలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలలుగా జైలులో పెట్టిన ఆప్ నేత వద్ద మద్యం కుంభకోణం తాలూకు ఒక్క పైసా కూడా దొరకనప్పుడు ఆయనను ఎందుకు జైల్లో పెట్టారని ఈడీకి కోర్టు మొట్టికాయలు వేసింది.
ఇక సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ పీబీ పరేల్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించింది. ఆప్ ఎంపీ దగ్గర లిక్కర్ స్కాంకు సంబంధించి నయా పైసా కూడా లభించనప్పుడు ఆరు నెలలు ఎలా జైలులో ఉంచారని ఈడీని న్యాయస్థానం నిలదీసింది. దాంతో దిగొచ్చిన ఈడీ బెయిల్ మంజూరుకు అంగీకరించింది. దీంతో సుప్రీంకోర్టు సంజయ్ సింగ్‌కు బెయిట్ ఇవ్వడంతో పాటు వెంటనే ఆయనను విడుదల చేయాల్సిందిగా ఈడీని ఆదేశించింది. కాగా, ఇదే మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లి 24 గంటలు కూడా గడవకముందే ఇప్పుడు ఆప్ నేతకు బెయిల్ రావడం గమనార్హం.