Raghunandan Rao: మూడున్నర కోట్లు పట్టుకున్నా కోమటిరెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: రఘునందన్ రావు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లను నిందితులుగా చేర్చాలన్న రఘునందన్
- ఈ కేసుపై 2014 నుంచే విచారణ చేపట్టాలని డిమాండ్
- స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ. 3.5 కోట్లు ఎక్కడకు పోయాయని ప్రశ్న
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఈ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో వీళ్లిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు బీజేపీ నేత రఘునందన్ రావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో నిందితులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిల పేర్లను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో 2014 నుంచే విచారణ చేపట్టాలని అన్నారు.
మునుగోడు ఉపఎన్నికల సమయంలో రూ. 3.5 కోట్లను పట్టుకున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ. 30 కోట్లు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి గతంలో తాను ఫిర్యాదు చేశానని... ఆ ఫిర్యాదుపై పోలీసులు ఉన్నతాధికారులను ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.