Minister Jaishankar: ఇంటికి పేరును మారిస్తే సొంత‌మైపోతుందా?: జై శంక‌ర్‌

Minister Jaishankar reacts to China naming of places in Arunachal Pradesh

  • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 30 ప్రాంతాల‌కు చైనా పేర్లు మార్చ‌డంపై మంత్రి జై శంక‌ర్ ఘాటు స్పంద‌న‌
  • ఇలా పేర్లు పెట్టినంత మాత్రాన వాస్త‌వాలు మార‌వ‌ని మంత్రి కౌంట‌ర్ 
  • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మేన‌న్న జై శంక‌ర్‌

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 30 ప్రాంతాల‌కు చైనా పేర్లు మార్చ‌డంపై విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి జై శంక‌ర్ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి స‌రిహ‌ద్దు వివాదం కొన‌సాగుతున్న వేళ మ‌రోసారి అరుణాచ‌ల్‌లోని కొన్ని ప్రాంతాల‌కు డ్రాగ‌న్ కంట్రీ కొత్త‌గా పేర్లు పెట్టింది. ఇలా పేర్లు పెట్టినంత మాత్రాన వాస్త‌వాలు మార‌వ‌ని మంత్రి కౌంట‌ర్ ఇచ్చారు. 

గుజ‌రాత్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి జై శంక‌ర్‌కు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 30 ప్రాంతాల‌కు చైనా పేర్లు మార్చ‌డంపై ప్ర‌శ్న ఎదురైంది. ఈ ప్ర‌శ్న‌కు మంత్రి త‌న‌దైన శైలిలో జవాబు ఇచ్చారు. "నేనొచ్చి ఒక‌రి ఇంటికి ఉన్న‌ పేరున మార్చేస్తే, ఆ ఇల్లు నాద‌వుతుందా? అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే. పేర్లు మార్చ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద సైన్యం కాప‌లా ఉంది" అని మంత్రి గుర్తు చేశారు. 

ఇదిలాఉంటే.. గ‌త కొంత‌కాలంగా భార‌త్‌లో అంత‌ర్బాగ‌మైన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ‌ద‌ని చైనా వాదిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆ రాష్ట్రంలోని 30 ప్రాంతాల‌కు చైనా పేర్లు మార్చింది. వీటిలో 11 నివాస ప్రాంతాలు కాగా, 12 ప‌ర్వ‌తాలు, 4 న‌దులు, ఒక స‌ర‌స్సుతో పాటు ఒక ప‌ర్వ‌త మార్గం ఉన్న‌ట్లు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ గ్లోబ‌ల్ టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

More Telugu News