Sujana Chowdary: ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియకపోతే జీపీఎస్ వాడతా... కేశినేని నాని వ్యాఖ్యలకు సుజనా కౌంటర్
- విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి
- నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో సుజనాకు తెలుసా అంటూ కేశినేని నాని సెటైర్
- కేశినేని నాని స్థాయికి తాను దిగజారలేనన్న సుజనా
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, సుజనాపై విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేయడం తెలిసిందే. విజయవాడ వెస్ట్ లో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా సుజనాకు తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై సుజనా చౌదరి గట్టిగా బదులిచ్చారు. తాను పక్కా లోకల్ అని స్పష్టం చేశారు.
"నేను విజయవాడలో పుట్టి పెరిగినవాడ్నే. నేను పుట్టిన ప్రదేశం నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. నేను ఇక్కడే చదువుకున్నాను. మా కుటుంబానికి ఇక్కడే బోలెడంత వ్యవసాయం ఉంది.
విజయవాడలో ఉన్న వాళ్లందరూ ఇక్కడి వాళ్లే కాదు కదా. చదువుకోవడానికి, ఇతర వ్యవహారాల కోసం ఇతర ఊర్లకు వెళుతుంటాం, వస్తుంటాం. నా విషయంలో లోకల్, నాన్ లోకల్ అని మాట్లాడడానికి నేనేమీ మహారాష్ట్ర వాడ్ని కాదు, ఉత్తరప్రదేశ్ వాడ్ని కాదు. కొందరు నేతలు ఏవో మాట్లాడుతుంటారు కానీ అందులో నిజం లేదు. కేశినేని నాని ఎందుకంత దిగజారి మాట్లాడారో అని ఆయనపై జాలిపడుతున్నా.
ఒకవేళ నాకు విజయవాడ వెస్ట్ లో ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియకపోతే జీపీఎస్ వాడుకుంటా. నేను బాగానే చదువుకున్నా... విజయవాడలో ప్రతి గల్లీకి వెళ్లగలను. ఇప్పుడు ఎవరు ఎక్కడికైనా వెళ్లగలరు. కేశినేని నాని స్థాయికి నేను దిగలేను" అని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
విజయవాడ వెస్ట్ లో జనసేన నేత పోతిన మహేశ్ కూడా కలిసి వస్తారని, విజయం తనదేనని సుజనా ధీమా వ్యక్తం చేశారు. పోతిన మహేశ్ తో పవన్ కల్యాణ్ మాట్లాడతారని తెలిపారు.