Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఈసారి రికార్డు స్థాయికి!
- అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్
- చైనా నుంచి అత్యధిక గిరాకీ
- భారత్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.70,978గా
- సరికొత్త గరిష్ఠాలకు పసిడి ధర
అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో, దేశంలో పుత్తడి ధర మరోసారి పెరిగింది. అది కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70,978గా ఉంది. ఒక్కరోజులో రూ.వెయ్యికి పైగా ధర పెరిగి, సరికొత్త గరిష్ఠ ధర నమోదైంది.
అమెరికా ద్రవ్యోల్బణం డేటా ఆశించిన స్థాయిలో ఉండడం, జూన్ నుంచి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉండడం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, అంతర్జాతీయంగా బంగారం రేట్లకు రెక్కలొచ్చాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా, చైనా నుంచి పసిడికి గిరాకీ ఎక్కువగా ఉండడం కూడా రికార్డు గరిష్ఠానికి ఓ కారణమని భావిస్తున్నారు.