BCCI: ఏప్రిల్ 16న ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ సమావేశం
- అహ్మదాబాద్ వేదికగా సమావేశం
- ఈ భేటీ వెనుక ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదన్న బీసీసీఐ అధికార ప్రతినిధి
- సమావేశానికి హాజరుకానున్న బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్
- ఈ మీటింగ్ ఉన్న రోజే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డీసీ, జీటీ మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోని మొత్తం 10 ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ ఈ నెల 16వ తేదీన అహ్మదాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీల ఓనర్లకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. ఇక ఈ మీటింగ్ ఉన్న రోజే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్ కూడా ఉంది.
"ఐపీఎల్ జట్ల యజమానులను సమావేశం కోసం ఆహ్వానించడం జరిగింది. ఈ భేటీ వెనుక ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు. ఐపీఎల్ సీజన్-17 ప్రారంభమై అప్పటికీ రెండు నెలలు పూర్తవుతాయి. అందుకే ఫ్రాంచైజీ ఓనర్లు సమావేశం కావడానికి అది సరియైన సమయం" అని పీటీఐతో బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
అయితే, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ హాజరయ్యే ఈ సమావేశంలో వచ్చే ఏడాది నిర్వహించనున్న మెగా వేలం విధివిధానాలు, ఆటగాళ్ల రిటెన్షన్స్‌తో పాటు ప్రస్తుతం ఫ్రాంచైజీలకు వేలంలో పాల్గొనేందుకు ఇస్తున్న రూ.100 కోట్ల పర్స్ వ్యాల్యూను కూడా పెంచే దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.