IPL 2024: ముంబై ఫ్యాన్స్ దాడిలో గాయపడ్డ సీఎస్‌కే అభిమాని మృతి!
![CSK Fan Dies After Being Assaulted By Mumbai Indians Fans in Kolhapur For Celebrating Rohit Sharmas Wicket During IPL 2024](https://imgd.ap7am.com/thumbnail/cr-20240401tn660a30116ad49.jpg)
- ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన మార్చి 27న జరిగిన ముంబై, హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్
- మ్యాచ్ జరుగుతున్న సమయంలో సీఎస్‌కే, ఎంఐ అభిమానుల మధ్య ఘర్షణ
- రోహిత్ శర్మ వికెట్ పడిన సమయంలో చెన్నై ఫ్రాంచైజీ అభిమాని హేళన
- దాంతో దాడికి పాల్పడిన ముంబై అభిమానులు
- దాడిలో తీవ్రంగా గాయపడ్డ చెన్నై అభిమాని బండోపంత్ బాపుసో టిబిలే మృతి
- మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఘటన
ఐపీఎల్ 2024 లో భాగంగా ఉప్పల్ వేదికగా మార్చి 27వ తేదీన ముంబై ఇండియన్స్ (ఎంఐ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముంబై ఫ్యాన్స్ సీఎస్‌కే అభిమానిపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కొంతమంది ఒకచోట చేరి హైదరాబాద్, ముంబై మ్యాచ్‌ను చూశారు. వీరిలో కొంతమంది సీఎస్‌కే అభిమానులుంటే, మరికొంత మంది ముంబై ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఎంఐ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ పడింది. దాంతో రోహిత్ అవుట్ అయిన వెంటనే సీఎస్‌కే అభిమాని అయిన 63 ఏళ్ల బండోపంత్ బాపుసో టిబిలే హేళనగా మాట్లాడుతూ, హిట్‌మ్యాన్ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు.
దాంతో బండోపంత్ అలా చేయడం నచ్చని ముంబై జట్టు అభిమానులు ఇద్దరు అతడిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. అతని తలపై కర్రలతో బలంగా కొట్టారు. దాంతో బండోపంత్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపుమడుగులో పడి ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు ఆదివారం మృతిచెందాడు. కాగా, బండోపంత్‌పై దాడికి పాల్పడిన నిందితులిద్దరినీ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.