Chiranjeevi: ఆ ఘటన తర్వాత నేను పాండీ బజార్ ముఖం చూడలేదు: చిరంజీవి

Chiranjeevi talks about his memories in career starting days

  • ఇటీవలే తెలుగు డీఎంఎఫ్ ఏర్పాటు
  • నేడు ఆరిజిన్ డే పేరిట హైదరాబాదులో స్పెషల్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
  • వ్యాఖ్యాతగా వ్యవహరించిన విజయ్ దేవరకొండ

ఇటీవల తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగు డీఎంఎఫ్) అనే ప్రత్యేక వేదిక పురుడు పోసుకుంది. ఈ సంస్థ నేడు హైదరాబాదులో ఆరిజిన్ డే పేరిట స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధంగా ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

ఈ సందర్భంగా విజయ్... చిరంజీవిని పలు ప్రశ్నలు అడిగారు. చిరంజీవి స్పందిస్తూ, తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ సంఘటనను అందరితో పంచుకున్నారు. 

"అది 1977 ప్రాంతం. మద్రాస్ లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులవి. ఒక రోజు ఓ స్నేహితుడు సరదాగా టీ తాగి వద్దాం రమ్మంటే  పాండీ బజార్ కు వెళ్లాను. అక్కడకు సాయంత్రం చాలామంది వస్తుంటారు అని చెబితే, సరేనని వెళ్లాను. వారు నన్ను చూడగానే... ఏంట్రా నీ స్నేహితుడా, ఏ ఊరు, ఏం పేరు? అని నా ఫ్రెండ్ ని అడిగారు. శివశంకర వరప్రసాద్ అని పేరు చెప్పి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. 

ఏంటి... సినిమాల్లో వేషాల కోసం వచ్చావా? అన్నారు. అవునండీ అన్నాను. ఏం వేషాలు? అన్నారు. ఏముందండీ... అవకాశం దొరికితే హీరోగా చేద్దామని... అన్నాను. వారు ఇంకొక వ్యక్తిని పిలిచి... చూడు, వీడు ముక్కు ముఖం ఎంత చక్కగా ఉన్నాడో... వీడికే దిక్కులేదు... నువ్వు హీరో అయిపోతావా? మేమంతా ఇదే పరిస్థితిరా బాబూ... చాలు చాల్లే... అంటూ నెగెటివ్ గా మాట్లాడారు. 

ఎంతో హుషారుగా వెళ్లిన వాడ్ని, వాళ్ల మాటలతో తీవ్ర నిరుత్సాహంతో తిరిగి వచ్చాను. నేను ఎప్పుడూ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, నాకు గురువులు ఎవరూ లేరు. నా గురువు ఆంజనేయ స్వామే. నా బాధలు ఆయనతో చెబుతాను... ఆయన నాకు సమాధానం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆయన సూచనలు తీసుకుంటాను, అలాగే నడుచుకుంటాను.

నిన్ను ఎవరు వెళ్లమన్నార్రా అక్కడికి... అక్కడందరూ దిక్కుమాలిన వాళ్లు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ కదా... ఎందుకు వెళ్లావురా అక్కడికి... నేను నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను కదా... అని ఆంజనేయస్వామి అడిగినట్టుగా భావించాను. అవును స్వామీ... నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అని బదులిచ్చాను. ఆ క్షణం నుంచి మళ్లీ పాండీ బజార్ వైపు వెళ్లలేదు. మనం నెగెటివిటీ ఉన్న చోటికి వెళితే మనం కూడా ఆ ప్రభావానికి లోనవుతాం" అని చిరంజీవి వివరించారు.

More Telugu News