CAR T Cell Therapy: బ్రిటన్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స తీసుకున్న తొలి పేషెంట్‌గా భారత సంతతి టీనేజర్
- అత్యాధునిక సీఏఆర్ టీ థెరపీ పొందిన 16 ఏళ్ల లండన్ బాలుడు యువన్ ఠక్కర్
- నేషనల్ హెల్త్ సర్వీస్ క్యాన్సర్ డ్రగ్స్ ఫండ్ ద్వారా అందుబాటులోకి చికిత్స
- లూకేమియా వ్యాధి నుంచి మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉపశమనం
- ఈ చికిత్సతో తన జీవితం మారిపోయిందని బాలుడి వ్యాఖ్య
రక్తక్యాన్సర్‌తో బాధపడుతున్న భారత సంతతి బ్రిటన్ బాలుడికి అత్యాధునిక చికిత్స తీసుకునే అవకాశం దక్కింది. బ్రిటన్‌లో సీఏఆర్ టీ థెరపీ అందుకున్న తొలి పేషెంట్‌గా యువన్ ఠక్కర్ (16) గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ చికిత్సతో తన జీవితం ఎంతో మారిపోయిందని అతడు చెప్పుకొచ్చాడు. బాలుడు కోలుకోవడంపై తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రార్థనలు ఆ దేవుడు ఎట్టకేలకు ఆలకించాడని సంబరపడ్డారు.
యువన్ ఠక్కర్ ఆరేళ్ల వయసులోనే లుకేమియా అనే క్యాన్సర్ బారిన పడ్డాడు. మొదట్లో కీమోథెరపీ తీసుకున్నా కూడా వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈ క్రమంలో అతడికి సీఏఆర్ టీ థెరపీ అందించారు. ‘‘ఈ చికిత్స తరువాత నా జీవితం ఎంతో మారిపోయింది. అంతకుమునుపు క్యాన్సర్ చికిత్స కోసం స్కూలుకు, ఆటపాటలకు దూరం కావాల్సి వచ్చింది. చాలా కాలం తరువాత నచ్చిన పనులు చేసే అవకాశం నాకు దక్కింది’’ అని టీనేజర్ హర్షం వ్యక్తం చేశాడు. తమ బిడ్డకు ఈ అత్యాధునిక చికిత్స దక్కడంపై తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ బిడ్డకు లభించిన మరో అవకాశమని వ్యాఖ్యానించారు. చిన్నారికి చికిత్స చేసిన డాక్టర్లకు, నర్సులకు ధన్యవాదాలు చెప్పని రోజంటూ లేదని వ్యాఖ్యానించారు.
యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ క్యాన్సర్ డ్రగ్స్ ఫండ్ (సీడీఎఫ్) ద్వారా సీఏఆర్ టీ చికిత్స అందించారు. 2016లో ఏర్పాటైన ఈ సంస్థ అత్యాధునిక చికిత్సలను త్వరితగతిన క్యాన్సర్ పీడుతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తుంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ అనుమతి పొందిన అత్యాధునిక చికిత్సను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటుంది.
ఏమిటీ సీఏఆర్ టీ చికిత్స..
ఈ చికిత్సలో పేషెంట్ రక్తకణాలనే క్యాన్సర్‌పై ఆయుధాలుగా ఉపయోగిస్తారు. తెల్లరక్త కణాల్లో ఒకటైన టీ సెల్స్‌ను తొలుత పేషెంట్ నుంచి సేకరిస్తారు. ఆ తరువాత.. క్యాన్సర్ కణాలను గుర్తించేలా వాటికి మార్పులు చేసి రోగి శరీరంలో ప్రవేశపెడతారు. దీంతో, అవి క్యాన్సర్ కణాలను సులువుగా గుర్తించి నాశనం చేస్తాయి.