Priyanka Gandhi: ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో ఎంతవరకు సామాన్య ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు?: బీజేపీని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ
- సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం
- లక్షల కోట్లు అప్పుగా తీసుకుని ఏం చేస్తున్నారంటూ? మండిపాటు
- బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత పదేళ్లలో దేశ అప్పు రూ. 150 లక్షల కోట్లకు పెరిగిందని ధ్వజం
- ప్రస్తుతం దేశంలోని ప్రతి పౌరుడిపై రూ. 1.5 లక్షల రుణం ఉందని పేర్కొన్న వైనం
- దేశ నిర్మాణంలో ఏ ప్రయోజనం కోసం ఈ డబ్బును వినియోగించారన్న ప్రియాంక గాంధీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అసలు ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో ఎంతవరకు సామాన్య ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు? దేశ నిర్మాణంలో ఏ ప్రయోజనం కోసం ఈ డబ్బును వినియోగించారు? అసలు అప్పుగా తీసుకున్న సొమ్ము దేనికి ఖర్చు చేస్తున్నారు?.. అంటూ పలు ప్రశ్నలు అడిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 14 లక్షల కోట్లకు పైగా రుణం తీసుకోబోతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ అప్పుతో కేంద్రం ఏం చేయాలనుకుంటోంది? అని ఆమె ప్రశ్నించారు.
ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2014 వరకు సుమారు 67 ఏళ్లలో దేశం మొత్త అప్పు రూ.55 లక్షల కోట్లు అని ప్రియాంక తెలిపారు. కానీ, గత పదేళ్లలో బీజేపీ సర్కార్ దాన్ని రూ.205 లక్షల కోట్లకు పెంచిందని మండిపడ్డారు. ఈ పదేళ్ల కాలంలో దాదాపు రూ.150 లక్షల కోట్ల అప్పు పెరిగిందని అన్నారు. ఈ లెక్కన దేశంలోని ప్రతి పౌరుడిపై రూ. 1.5 లక్షల రుణం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ కేంద్రలోని మోదీ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధించారు.
మోదీ సర్కార్‌కు ప్రియాంక గాంధీ అడిగిన ప్రశ్నలివే..
దేశ నిర్మాణంలో ఏ ప్రయోజనం కోసం ఈ డబ్బును వినియోగించారు?
వ్యాపారస్తుల రుణమాఫీకి ఎంత డబ్బు ఇచ్చారు?
రైతుల ఆదాయం రెండింతలు అయ్యిందా?
ప్రభుత్వ రంగం బలపడిందా? లేక బలహీన పడిందా?
పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించారా?
కోటీశ్వరుల రుణమాఫీకి ఎంత వెచ్చించారు?
పాఠశాలలు, ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి?
పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేశారా?
ఇలా పలు ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్ నేత.. ఇవన్నీ జరిగాయా? ఒకవేళ జరగకపోతే తీసుకున్న రుణం ఏమైందని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రియాంక చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.